- దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన 95 మంది ఎమ్మెల్యేలు...
- 11 మంది ఎంపీలపై కేసులు
- రాష్ట్రాల వారీగా బెంగాల్ కు ఫస్ట్ ప్లేస్
న్యూఢిల్లీ, వెలుగు: మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటోన్న వారిలో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలే టాప్ లో ఉన్నారు. బీజేపీకి చెందిన 95 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు ఈ నేరాల జాబితాలో ముందు వరుసలో నిలిచారు.
వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసులకు సంబంధించి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదికను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 772 మంది ఎంపీలు, 4,109 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్ లను పరిశీలించింది. ఇందులో 19 మంది ఎంపీలు, 168 ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాల కేసులు దాఖలైనట్లు వెల్లడించింది.
పార్టీ వారీగా బీజేపీనే టాప్
పార్టీల వారీగా చూస్తే... బీజేపీకి చెందిన 95 మంది ఎమ్మెల్యేలు, 10 మంది లోక్ సభ, 1 రాజ్య సభ సభ్యుడిపై ఈ తరహా కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ 20( 19 మంది ఎమ్మెల్యేలు, ఒక లోక్ సభ ఎంపీ), టీడీపీ నుంచి 18 మందిపై ఈ నేరాలు నమోదయ్యాయి. కాగా... తెలంగాణలోని మెదక్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావుపై రేప్ కేసు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది.
8వ స్థానంలో తెలంగాణ
మహిళలపై నేరాలకు సంబంధించి కేసుల ఎదుర్కొంటోన్న రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ టాప్ లో ఉంది. ఈ రాష్ట్రంలో 63 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలుమహిళలపై నేరాల కేసులు ఎదుర్కొంటున్నారు. తర్వాతి స్థానంలో ఏపీ 22(21 ఎమ్మెల్యేలు/ఒక ఎంపీ), ఒడిశా 17(16 ఎమ్మెల్యేలు/1 ఎంపీ), మహారాష్ర్ట 11(10 ఎమ్మెల్యేలు/ఒక ఎంపీ), బిహార్ 10(9 ఎమ్మెల్యే/ఒక ఎంపీ), కర్నాటకలో ఏడుగురు ఎమ్మెల్యేలపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
ఈ వరుసలో ఐదుగురిపై కేసులతో (ఇద్దరు ఎమ్మెల్యేలు/3 ఎంపీలు) 8వ స్థానంలో తెలంగాణ ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్.. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంలపై మహిళలకు సంబంధించిన నేరారోపణలు నమోదైనట్లు ఏడీఆర్ పేర్కొంది.
