ఓటర్ల నమోదు ‘పట్టని’భద్రులు!..ఇప్పటివరకు 4.50 లక్షల దరఖాస్తులే..

ఓటర్ల నమోదు ‘పట్టని’భద్రులు!..ఇప్పటివరకు 4.50 లక్షల దరఖాస్తులే..
  • 2021తో పోలిస్తే 43 శాతమే!
  • మహబూబ్‌‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌‌లో 37%
  • వరంగల్–ఖమ్మం–నల్గొండలో 49% నమోదు
  • ఎన్రోల్మెంట్‌‌కు నవంబర్ 6 ఆఖరు.. మిగిలింది 14 రోజులే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపడం లేదు. విద్యావంతుల సంఖ్య పెరిగినా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఫారం–18 స్టేటస్ రిపోర్టు ప్రకారం.. గురువారం నాటికి రెండు నియోజకవర్గాల్లో కలిపి 4.50 లక్షల దరఖాస్తులే వచ్చాయి. 2021 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో 10,36,833 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు నమోదైన దరఖాస్తులు అందులో 43 శాతమే. 

మహబూబ్‌‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌‌లో గతంలో 5.31 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఈసారి 1.97 లక్షల దరఖాస్తులే (37 శాతమే) వచ్చాయి. వరంగల్–ఖమ్మం–నల్గొండలో గతంలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2.53 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ నమోదు 50 శాతానికి చేరింది. నవంబర్ 6తో గడువు ముగియనుండగా, మరో 14 రోజులే మిగిలాయి.

లక్ష్యం చేరుకునేదెట్ల?: పార్టీలకు పరీక్ష

రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఒక్కో స్థానంలో కనీసం ఏడు లక్షల మంది చొప్పున మొత్తం 14 లక్షల మంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీలు, సంఘాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా మారింది. ఈ నెల 15 నుంచి 21 వరకు వారం రోజుల్లో రెండు స్థానాల్లో కలిపి 80 వేల ఫారాలే వచ్చాయి. రోజుకు సగటున 13 వేల దరఖాస్తులు మాత్రమే నమోదవుతున్నాయి. 

నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే నమోదు వేగాన్ని కనీసం ఐదు రెట్లు పెంచాల్సి ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతో మిగిలిన 14 రోజులను సమర్థంగా వినియోగించుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నా, ఆన్‌‌లైన్‌‌లో ఫారం–18 నింపడం, సర్టిఫికెట్లు అప్‌‌లోడ్ చేయడంపై అవగాహన లేకపోవడం కూడా దరఖాస్తులు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. 

ముఖ్యంగా ఐటీ కారిడార్లు, పట్టణ ప్రాంతాల గ్రాడ్యుయేట్లు నమోదుపై శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, కాలేజీలు, ప్రైవేటు సంస్థలు, నిరుద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై పడింది. నవంబర్ 6 తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.