- వీటి విలువ రూ.4.9 లక్షల కోట్లు
- మొత్తం 22 రెట్ల సబ్స్క్రిప్షన్
ముంబై: జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచంలోనే మొదటిసారిగా కోటి అప్లికేషన్లను అందుకున్న పబ్లిక్ ఆఫర్‌గా నిలిచింది. ఈ ఐపీఓలో మొత్తం 19.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యాహ్నం వరకే 438 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. వీటి విలువ రూ.4.9 లక్షల కోట్లు. యాంకర్ బుక్ విలువను కూడా కలుపుకుంటే రూ.7.4 లక్షల కోట్లు అవుతుంది. ఇష్యూకు దాదాపు 22 రెట్ల స్పందన వచ్చింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ) విభాగంలో 4.90 కోట్ల షేర్లకు గాను 70.85 రెట్ల సబ్స్క్రిప్షన్ నమోదయింది.
మ్యూచువల్ ఫండ్ల నుంచి 4.40 కోట్ల షేర్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 14 రెట్లు సబ్స్క్రయిబ్ అయింది. సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు 8.50 కోట్ల షేర్లకు గాను 23.11 కోట్ల షేర్లకు బిడ్లు వేశారు. ఈ విభాగం 2.72 రెట్లు సబ్స్క్రయిబ్అయింది. వాటాదారుల కోటాకు 7.60 రెట్లు, ఉద్యోగుల కోటాకు 2.93 రెట్లు స్పందన వచ్చింది. ఈ ఐపీవో ద్వారా జియో 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేస్తోంది.
గరిష్ట ధర వద్ద కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించనుంది. సుమారు 108 బిలియన్ డాలర్ల విలువను దక్కించుకుంటుంది. ప్రమోటర్లు, వాటాదారులు తమ షేర్లను విక్రయించడం లేదు. ఇది పూర్తిగా ఫ్రెష్ఇష్యూ. ఈ నెల 19న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లను కంపెనీ సేకరించింది. ఈ నెల 28న జియో షేర్లు లిస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.
గతంలో భారీగా అప్లికేషన్లు సాధించిన ఐపీఓలు
ఐపీఓ పేరు అప్లికేషన్లు సబ్స్క్రిప్షన్
(లక్షల్లో) (రెట్లు)
వారీ ఎనర్జీస్ 97 76.34
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 89 63.61
టాటా టెక్నాలజీస్ 73.5 69.43
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 65 54.02
ఎల్ఐసీ ఇండియా 73 2.95
