- బొగ్గు గనులు లేని దామరచర్లలో వార్షికంగా ఆరు శాతం జంప్
- మొత్తం ఆదాయం రూ.49,244 కోట్లు
- షేరుకు రూ.26 డివిడెండ్
- రెవెన్యూ గైడెన్స్ తగ్గింపు
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది జులై–సెప్టెంబర్ (క్యూ2) క్వార్టర్ ఫలితాలను వెల్లడించింది. నికర లాభం వార్షికంగా 6 శాతం పెరిగి రూ.7,823 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ లాభం రూ.7,364 కోట్లు ఉంది. జూన్ క్వార్టర్లో నమోదైన రూ.7,769 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 0.7 శాతం ఎక్కువ. ఆదాయం 11 శాతం పెరిగి రూ.49,244 కోట్లకు చేరింది. జూన్ క్వార్టర్లో వచ్చిన రూ.48,211 కోట్ల రాబడితో పోలిస్తే 2 శాతం పెరిగింది. డాలర్ రూపంలో ఆదాయం 1.3 శాతం పెరిగి 5.15 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.48,652 కోట్లు) నిలిచింది.
ఈసారి సంస్థ సాధించిన మొత్తం పెద్ద డీల్స్ విలువ 5.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో కొత్త వ్యాపార వాటా 62 శాతంగా ఉంది. వీటిలో 2 బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారీ మెగా డీల్ కూడా ఉంది. ప్రతికూల మార్కెట్ పరిస్థితుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ గైడెన్స్‌ను 1.5–-3 శాతం నుంచి 1–-2 శాతానికి తగ్గించింది. ఆపరేటింగ్ మార్జిన్ అంచనాలను 20-–22 శాతంగానే ఉంచింది. ప్రతి షేరుకు రూ.26 చొప్పున తాత్కాలిక డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీగా నవంబర్ మూడును నిర్ణయించింది.
ఏఐలో దూకుడు
ఏఐ సేవల రంగంలో కంపెనీ వృద్ధి సాధించింది. తాజా క్వార్టర్లో ఏఐ సేవల రాబడి మునుపటి క్వార్టర్‌తో పోలిస్తే 29 శాతం పెరిగింది. మొత్తం రాబడిలో 10.5 శాతం వాటాను సొంతం చేసుకుంది. వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున ఏఐ వైపు మళ్లుతున్న వేళ ఈ ఫలితాలు వచ్చాయని సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు. విదేశీ మార్కెట్లను గమనిస్తే.. యూరప్‌లో 4.6 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం రాబడిలో 54.6 శాతం వాటా ఉన్న ఉత్తర అమెరికాలో 1.5 శాతం క్షీణత కనిపించింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 10.4 శాతం పెరిగి రూ.10,330 కోట్లకు చేరింది. ఫ్రీ క్యాష్‌ఫ్లో రూ.8,898 కోట్లు ఉంది.
నగదు, పెట్టుబడుల నిల్వలు రూ.45,232 కోట్లకు చేరాయి. ఉద్యోగుల సంఖ్య 3,32,542కి పెరిగింది. ఈ మూడు నెలల్లో నికరంగా 4,480 మంది చేరారు. రాజీనామాల రేటు (ఆట్రిషన్) 12.7 శాతానికి తగ్గింది. 2027 మొదటి అర్ధభాగంలో నికర లాభం 9 శాతం పెరిగి రూ.15,592 కోట్లకు, రాబడి 12 శాతం పెరిగి రూ.97,454 కోట్లకు చేరిందని ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లకు అందజేసిన ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఐటీ కంపెనీల్లో పెరుగుతున్న ఉద్యోగులు
ఇన్ఫోసిస్ సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో కొత్తగా 4,480 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,32,542కి చేరింది. టీసీఎస్ క్యూ2లో 4,258 మంది ఉద్యోగులను చేర్చుకోగా, సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,98,056 మందికి చేరింది. హెచ్‌సీఎల్‌టెక్ 6,136 మంది ఫ్రెషర్లతో కలిపి మొత్తం 6,450 మందిని నియమించుకుంది. మొత్తం సిబ్బంది 2,30,339కి పెరిగారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య 6,716 మేర తగ్గి 2,36,328కి చేరింది.
