క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     ఇందిరమ్మ టవర్స్‌‌‌‌ నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని ఆదేశం
  •     అధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, వీటి కోసం స్థలాలు గుర్తించాలని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గంలో 500 ఫ్లాట్ల నిర్మాణం చేపడుతున్నామని, త్వరలోనే పనులు స్టార్ట్ చేస్తామన్నారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శుక్రవారం సెక్రటేరియట్‌‌‌‌లో రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేశ్ కుమార్, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలోని నియోజకవర్గాలవారీగా మొదటి విడత నిర్మాణాలకు అవసరమైన స్థలాల గుర్తింపును పూర్తి చేయాలన్నారు. రెండో, మూడో విడతల్లో చేపట్టనున్న నిర్మాణాలకు కూడా ముందుగానే భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌‌‌‌గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. “ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. పేదవాడికి సొంత ఇంటిని అందించడం కంటే తమ ప్రభుత్వానికి మరే అంశమూ ఎక్కువ కాదు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలి.” అని మంత్రి తెలిపారు.

నెలాఖరులోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి..

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌–మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్‌‌‌‌రూమ్ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను ఉపయోగించి లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌‌‌‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌–మల్కాజిగిరి జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్లు ప్రియాంక అలా, నారాయణరెడ్డి, మను చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.