నేర తీవ్రత ఉన్నా ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయరా?..మల్కాజిగిరి పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

నేర తీవ్రత ఉన్నా ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయరా?..మల్కాజిగిరి పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: నేరం తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు ఎఫ్‌‌ఐఆర్‌‌ ఎందుకు నమోదు చేయరని మల్కాజిగిరి పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ రాజీ కుదిరిందని అనుకున్నప్పటికీ తీవ్రమైన నేరంలో ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయకపోవడం సమర్థనీయం కాదని పేర్కొంది. తనపై, తన కుటుంబంపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మేడ్చల్‌‌ మల్కాజిగిరికి చెందిన కుంట సరోజ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌‌ జడ్జి రాజీ కారణంగా పోలీసులు ఫిర్యాదును మూసివేయడంతో అభ్యంతరాలుంటే కింది కోర్టులో నిరసన పిటిషన్‌‌ దాఖలు చేసుకోవాలని ఆదేశిస్తూ  విచారణను మూసివేశారు. దీనిని సవాలు చేస్తూ సరోజ దాఖలు చేసిన అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌ నందికొండ నర్సింగ్‌‌రావు  ధర్మాసనం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమ ఇంటిపై గుంపుగా దాడి చేశారన్నారు. ఈ దాడిలో పిటిషనర్‌‌ గాయపడి ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌‌ కుమారుడు అత్యాచారం కేసులో ఉన్నందున ఇరుగుపొరుగువారు గుమికూడారని, వారితో పిటిషనర్‌‌ కుటుంబ సభ్యులకు వాగ్వివాదం జరిగిందన్నారు. అనంతరం చర్చలతో రాజీ కుదిరి సమస్య పరిష్కారమైందని తెలిపారు. పూర్తి వివరణ ఇవ్వడానికి మరింత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.