ఆదివాసీలకు 125 రోజుల ఉపాధి భరోసా..ఎల్‌‌‌‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్కార్‌‌‌‌ నిర్ణయం

ఆదివాసీలకు 125 రోజుల ఉపాధి భరోసా..ఎల్‌‌‌‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్కార్‌‌‌‌ నిర్ణయం
  • గిరిజనుల వలసలకు అడ్డుకట్టవేసేలా ప్లాన్‌‌‌‌
  • జాబ్‌‌‌‌ కార్డులు లేని కుటుంబాలకు కొత్త కార్డుల మంజూరు
  • 18 ఏండ్లు నిండినోళ్లందరి పేర్లూ నమోదు చేయాల్సిందే..
  • యుద్ధప్రాతిపదికన తప్పుల సవరణకు స్పెషల్‌‌‌‌ క్యాంపులు
  • కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలకు పంచాయతీరాజ్‌‌‌‌ శాఖ ఆదేశాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :రాష్ట్రంలో ఎల్‌‌‌‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితులను తట్టుకుని, ఆదివాసీలు, గిరిజనులు వలస బాట పట్టకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించింది.

 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఆ శాఖ కమిషనర్‌‌‌‌ డి.దివ్య శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో జాబ్ కార్డులు లేని అర్హులైన ప్రతి కుటుంబానికీ వెంటనే కొత్త కార్డులు మంజూరు చేయాలని, చట్ట ప్రకారం వీరందరికీ 125 రోజుల ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపై ఈనెల 15న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సబ్‌‌‌‌ కలెక్టర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌తో గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోయి గిరిజనులు పొట్టకూటి కోసం వలస వెళ్లే ప్రమాదం ఏర్పడడవంతో, దీనిని అడ్డుకోవాలంటే ఉపాధి హామీ పథకాన్ని కవచంలా వాడాలని ప్రభుత్వం భావిస్తోంది. 

అంతరించిపోతున్న ఆదిమ తెగలు  చెంచులు, ఇతర గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పనులను ముమ్మరం చేయనున్నారు. కార్డుల్లో తప్పులుంటే క్యాంపులు పెట్టి సారి చేయనున్నారు. జాబ్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు గ్రామీణ రోజ్‌‌‌‌గార్‌‌‌‌ గ్యారంటీ పథకంలో జాబ్‌‌‌‌ కార్డులు లేని గిరిజన కుటుంబాలన్నింటికీ వెంటనే కొత్త కార్డులు అందించాలి. 


కుటుంబంలో 18 ఏండ్లు నిండిన యువతీ యువకులందరి పేర్లను వారి కుటుంబ పాత జాబ్‌‌‌‌ కార్డుల్లో నమోదు చేయాలి. ఈ మార్గదర్శకాలను పకడ్బందీగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని 31 జిల్లాల కలెక్టర్లు, డీపీసీలు, 4 ఐటీడీఏల ప్రాజెక్ట్ ఆఫీసర్లు (పీవోలు), డీఆర్‌‌‌‌డీవోలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఆదేశాలు పంపారు.  ప్రభుత్వ తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో పనుల కొరత తీరి, వలసలకు అడ్డుకట్ట పడుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది.