గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
  •     ఖేలో ఇండియా గేమ్స్‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
  •     తెలంగాణలో డిసెంబర్‌‌ 11 నుంచి 22 వరకు పోటీలు
  •     మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ఖేలో ఇండియా గేమ్స్‌‌ నిర్వహణపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పోటీల నిర్వహణ, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాలు, శిక్షణ, వసతి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో డిసెంబర్‌‌ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌‌లు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొత్తం 27 క్రీడాంశాల్లో 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా దశలవారీగా క్రీడాకారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా పోటీలు జరిగే స్టేడియాలు, క్రీడా వేదికలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, ఇతర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.