ప్రైవేట్ కాలేజీలకు షాక్!..27 కాలేజీలకు నో అఫిలియేషన్.. నిల్ అడ్మిషన్లు!

ప్రైవేట్ కాలేజీలకు షాక్!..27 కాలేజీలకు నో అఫిలియేషన్.. నిల్ అడ్మిషన్లు!
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఈ ఏడాది గుర్తింపు ఇవ్వలేదు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 27 జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ నిరాకరించింది. వీటిని జీరో అడ్మిషన్ కాలేజీలుగా ప్రకటించింది. ఈ మేరకు గుర్తింపు లేని కాలేజీలు, జీరో అడ్మిషన్ కాలేజీల ఫస్ట్ ఫేజ్ లిస్టును ఇంటర్ బోర్డు తన అధికారిక వెబ్ సైట్​లో పెట్టింది. దీంట్లో ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థల బ్రాంచీలు కూడా ఉండటం గమనార్హం. 

బోర్డు విడుదల చేసిన నో అడ్మిషన్, నో అఫిలియేషన్ జాబితాలో పేరుమోసిన కార్పొరేట్ బ్రాంచీలే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ప్రముఖ విద్యాసంస్థలు ఆదిభట్లలో రెండు క్యాంపస్‌‌లు ఉండగా, నారాయణగూడ, కూకట్‌‌పల్లి వివేకానందనగర్ బ్రాంచీలు ఉన్నాయి.  మరో ప్రముఖ విద్యాసంస్థకు చెందిన కాలేజీలు గుడిమల్కాపూర్, ఘట్‌‌కేసర్ (ఔషాపూర్), బోడుప్పల్, టోలిచౌకి (ఒకేషనల్) క్యాంపస్‌‌లు ఉన్నాయి. చంపాపేట్ రోడ్డులో, బాచుపల్లిలో, వనస్థలిపురంలో, సైదాబాద్‌‌లో, దిల్​సుఖ్​నగర్, మదీనాగూడ, నారాయణగూడలోని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు లేవని  వెల్లడించింది.

హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే ఎక్కువ

గుర్తింపు కోల్పోయిన 27 కాలేజీల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని కాలేజీలే మెజార్టీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 14, మేడ్చల్ 7, హైదరాబాద్ జిల్లాలో 6 కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఒకటి, యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లిలో మరో కాలేజీ, భూదాన్ పోచంపల్లి, పెద్దపల్లిలో , పాతబస్తీ శాలిబండలోని మరో రెండు కాలేజీలు ఉన్నాయి.