- మొదటి దశలో 100 శాతం సంస్కరణలు పూర్తి
- సంస్కరణల అమలుపై సీఎస్ సంజయ్ జాజు, కేంద్ర సెక్రటరీ సుకృతి లిఖి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా నిబంధనల సరళీకరణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అమలులో రాష్ట్రం ముందంజలో ఉందని సీఎస్సంజయ్ జాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో డీరెగ్యులేషన్ అండ్ కంప్లయెన్స్ రిడక్షన్ (నియంత్రణల సరళీకరణ, అనుసరణ భారం తగ్గింపు) అమలులో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖితో కలిసి శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కేంద్రం నిర్దేశించిన నియంత్రణల సరళీకరణ మొదటి దశలో మొత్తం 23 ప్రాధాన్యతా అంశాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసి నూరు శాతం లక్ష్యాన్ని సాధించిందన్నారు. ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర జన విశ్వాస్ బిల్లును ఆమోదించి చట్టంగా తీసుకురావడంతో మొదటి దశలో మిగిలి ఉన్న తుది సంస్కరణ కూడా పూర్తయిందని వివరించారు. ఇదే స్ఫూర్తితో రెండో దశ సంస్కరణలను వేగవంతం చేశామని, ఇందులో గుర్తించిన మొత్తం 28 ప్రాధాన్యతా అంశాల్లో ఇప్పటివరకు 12 అంశాలను అమలు చేశామని తెలిపారు. నిర్దేశిత గడువు నవంబర్ 15లోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నిబంధనల క్రమబద్ధీకరణ, సంస్కరణల అమలులో తెలంగాణ ప్రదర్శిస్తున్న చొరవను, సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖి అభినందించారు. తెలంగాణలో వివిధ శాఖల సమన్వయంతో సంస్కరణలు వేగంగా అమలవుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
