- మారుతున్న నేరాలకు తగ్గట్టుగా పోలీసింగ్‌లో సంస్కరణలు
- సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడికి ఉమ్మడి వ్యూహాలు
- పొరుగు రాష్ట్రాలకు సాంకేతిక సాయం అందిస్తం
- 2029 నాటికి నషాముక్త్ భారత్ లక్ష్యంగా కార్యాచరణ
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడం ద్వారా అంతర్రాష్ట్ర నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా పొరుగు రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలని, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసింగ్‌లో మార్పులు, సంస్కరణలు రావాలని సూచించారు. దక్షిణ భారతదేశాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. సదస్సులో చర్చించిన అంశాలపై పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సు జరగడం గర్వకారణమని సీఎం అన్నారు. ఏ ఒక్క రాష్ట్రం తన ప్రయత్నాలతోనే నేరరహితంగా మారడం సాధ్యం కాదన్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు కీలక సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు పోలీసింగ్ విధానాల్లో నిరంతర సంస్కరణలు, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమన్నారు. పోలీసు వ్యవస్థ, వనరులకు చేసే ఖర్చుతోపాటు సంస్కరణలను కూడా సమాజ నిర్మాణం, పౌరుల భద్రత కోసం పెట్టుబడిగా భావిస్తానని చెప్పారు.
మ్యూల్ అకౌంట్లు, నగదు బదిలీలపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన జరిగిన సదస్సులో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ పోలీసింగ్ విధానాలను అధికారులు వివరించారు. విపత్తుల సమయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు. 2029 డిసెంబర్ నాటికి నషాముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించేలా మత్తుపదార్థాల తయారీ, సరఫరా, రవాణా, ముఠాలను ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహాలు, ఇంటెలిజెన్స్ సహకారంపై చర్చించారు. తీవ్రవాదం, మావోయిస్టుల సమస్య ముగిసిన తర్వాత నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా జెన్‌జీ ఆందోళనలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపైనా చర్చించారు.
సైబర్ నేరగాళ్లు మ్యూల్ అకౌంట్లను ఉపయోగించకుండా అడ్డుకోవడం, నగదు బదిలీలను నిలువరించడం వంటి అంశాలపై చర్చించారు. ఆర్థిక నేరాలు, మానవ అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు దక్షిణాది రాష్ట్రాల పోలీసు విభాగాలు, ఇతర దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయడంపైనా సమాలోచనలు జరిపారు. ఈ సదస్సులో కర్ణాటక డీజీపీ ఎంఏ సలీమ్, తమిళనాడు డీజీపీ మహేశ్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ అడిషనల్ డీజీ బి. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ రవికృష్ణ, తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయల్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు, డీఎస్పీ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పోలీసుల పనితీరుకు గుర్తింపు
ప్రధాని నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షలో సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సీఎం గుర్తుచేశారు. తెలంగాణను పూర్తిగా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారని తెలిపారు. సైబర్ నేరాల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు తిరిగి ఇప్పించడంలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ పోలీసుల పనితీరుకు కేంద్ర హోంశాఖతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కొనియాడారు.
నేరాల నియంత్రణలో పొరుగు రాష్ట్రాలకు అవసరమైన సాంకేతికత, సహకారం అందించేందుకు తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీసు వ్యవస్థను మూడు కమిషనరేట్లుగా విభజించడం వల్ల ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఏర్పడిందని సీఎం తెలిపారు. అమెరికాలోని ఎఫ్‌డీఏ తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం టీజీ సేఫ్ పనిచేస్తోందన్నారు. చెరువులు, ప్రభుత్వ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని చెప్పారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.
