800 మంది లెక్చరర్ల సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్..ఇతర రాష్ట్రాల్లో చదివిన 250 మందిపై స్పెషల్ ఫోకస్‌‌

800 మంది లెక్చరర్ల సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్..ఇతర రాష్ట్రాల్లో చదివిన 250 మందిపై స్పెషల్ ఫోకస్‌‌
  •     నకిలీ జెన్యూనిటీ సర్టిఫికెట్లతోనూ మోసం 
  •     ఇప్పటికే 50 మంది ఔట్​.. 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 800 మంది జూనియర్ లెక్చరర్ల విద్యార్హత సర్టిఫికెట్లను ఇంటర్ విద్యాశాఖ మళ్లీ తనిఖీ చేస్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి పీజీ చేసిన సుమారు 250 మంది సర్టిఫికెట్లపై ప్రత్యేకంగా పరిశీలన జరుపుతోంది. ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలిన 50 మందిని సర్వీస్ నుంచి తొలగించింది. మిగతా తనిఖీలను రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్‌‌లో సుమారు 3,200 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశారు. అప్పట్లో సర్టిఫికెట్ల తనిఖీ లోతుగా జరగలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు సర్వీస్ కన్ఫర్మేషన్ కోసం మళ్లీ వెరిఫికేషన్ చేపట్టడంతో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి డిస్టెన్స్ విధానంలో పొందిన పీజీ సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నకిలీ జెన్యూనిటీ సర్టిఫికెట్లు..

సర్టిఫికెట్లపై అనుమానాలు రావడంతో సంబంధిత యూనివర్సిటీల నుంచి జెన్యూనిటీ సర్టిఫికెట్లు సమర్పించాలని అధికారులు ఆదేశించారు. అయితే కొందరు బయటే నకిలీ లెటర్‌‌హెడ్లు, స్టాంపులతో సర్టిఫికెట్లు తయారు చేయించి ఇచ్చినట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో ఇంటర్ విద్యాశాఖ ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాసి ధ్రువీకరణ కోరింది. స్పందన రాని చోట్లకు ప్రత్యేక బృందాలను పంపి వివరాలు సేకరించింది. కొన్ని వర్సిటీలు తాము ఆ సర్టిఫికెట్లు జారీ చేయలేదని, మరికొన్ని ఆ కోర్సులే తమవద్ద లేవని తెలిపినట్లు అధికారులు గుర్తించారు.

రెండు నెలల్లో పూర్తి నివేదిక..

వర్సిటీల నుంచి వస్తున్న నివేదికల ఆధారంగా ఇప్పటివరకు 50 మందిపై చర్యలు తీసుకున్నారు. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి, ఫేక్​సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలిన వారిపై సర్వీస్ పరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

విచారణ కొనసాగుతోంది
కాంట్రాక్టు నుంచి రెగ్యులరైన లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతోంది. పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన తర్వాతే, షోకాజ్ నోటీసులు ఇచ్చి సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నాం. ఇంకా 800 మంది వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కావాల్సి ఉంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తం. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేసిన వారుంటే వారిని సర్వీస్ నుంచి తొలగిస్తం. - అభిలాష అభినయ్, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్​