ఒక్కసారి వాడే సర్జికల్స్ ను మళ్లీ వాడితే కఠిన చర్యలు..సింగిల్ యూజ్డ్ పరికరాల ఉపయోగంపై కేంద్రం సీరియస్

ఒక్కసారి వాడే సర్జికల్స్ ను మళ్లీ వాడితే కఠిన చర్యలు..సింగిల్ యూజ్డ్ పరికరాల ఉపయోగంపై కేంద్రం సీరియస్
  •     దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ డీజీహెచ్ఎస్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న ప్రమాదకర దందాపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సిన వైద్య పరికరాలు, డిస్పోజబుల్ సర్జికల్ వస్తువులను మళ్లీ మళ్లీ రోగులపై వాడడంపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ లవనీశ్ జి.కృష్ణ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలు, హెల్త్ సెక్రటరీలు, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి ఆదేశాలు జారీ చేశారు.

గుండె, క్యాన్సర్ సర్జరీల్లోనూ ఇదే తంతు..

ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో తీవ్రమైన రోగాలకు చేసే ఆపరేషన్లలోనూ ఈ అక్రమ తంతు సాగుతున్నట్లు కేంద్రం గుర్తించింది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ (సీటీవీఎస్), న్యూరోసర్జరీ వంటి కీలకమైన, సున్నితమైన విభాగాల్లో సింగిల్ యూజ్ పరికరాలను విచ్చలవిడిగా రీ యూజ్ చేస్తున్నట్లు డైరెక్టరేట్ దృష్టికి వచ్చింది. ఒక్కసారి మాత్రమే వాడాలని స్పష్టంగా ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఒక సర్జరీలో వాడిన వస్తువులను క్లీన్ చేసి, స్టెరిలైజ్ చేసి తర్వాతి రోగులపై ఉపయోగిస్తున్నారని కేంద్రం పేర్కొంది. ఇంతటితో ఆగకుండా, ఆ పరికరాలకు సంబంధించిన పూర్తి ఖర్చును రోగుల నుంచి పిండుకుంటున్నారని, గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ రీయింబర్స్‌‌మెంట్ల ద్వారా ప్రభుత్వాల నుంచి నిధులను క్లెయిమ్ చేసుకుంటున్నారని మండిపడింది.

మళ్లీ మళ్లీ వాడితే ఇన్ఫెక్షన్ల ముప్పు..

ఒక్కసారి వాడి పారేయాల్సిన పరికరాలను మళ్లీ వాడడం వల్ల రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని కేంద్రం హెచ్చరించింది. ఈ పద్ధతి వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉండడంతో పాటు, పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం, పనితీరు మందగించడం, శస్త్రచికిత్సల సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటి ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. 

తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి..

రోగుల భద్రత, ఇన్ఫెక్షన్ల నియంత్రణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ సింగిల్ యూజ్ పరికరాల పునర్వినియోగాన్ని ప్రభుత్వం నిషేధిస్తున్నట్లు డాక్టర్ లవనీశ్ జి. కృష్ణ స్పష్టం చేశారు. పరికరాలను తయారు చేసిన ఒరిజినల్ ఎక్విప్‌‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ (ఓఈఎం) ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే వాటిని వినియోగించాలని తెలిపారు.