- ఒక షాపు లైసెన్స్ రద్దు.. మరో మూడింటికి వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా మత్తునిచ్చే మందులు అమ్ముతున్న మెడికల్ షాపులపై టీజీ సేఫ్ డ్రగ్స్ విభాగం, పోలీసులు చర్యలు చేపట్టారు. క్యూర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 106 షాపుల లైసెన్సులను సస్పెండ్ చేయగా, ఒక షాపు లైసెన్స్‌ను రద్దు చేశారు. మరో మూడు షాపులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 6న సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రగ్స్ విభాగం అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940ను ఉల్లంఘించిన 110 దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. సస్పెండైన 106 షాపుల్లో 99 వాటిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేటు కొనసాగనుంది. మరో ఐదు షాపులపై ఏడు రోజుల పాటు, రెండు షాపులపై మూడు రోజుల పాటు సస్పెన్షన్ విధించారు.
ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి..
రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సైకోట్రోపిక్, షెడ్యూల్ హెచ్, హెచ్-1 మందులను విక్రయించొద్దని అధికారులు మెడికల్ షాపుల నిర్వాహకులను హెచ్చరించారు. మందుల కొనుగోళ్లు, అమ్మకాలు, నిల్వలకు సంబంధించిన రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్తు మందుల అక్రమ అమ్మకాలు, రవాణా గురించి సమాచారం ఉంటే 1800-599-6969 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
