హైదరాబాద్లో డిసెంబర్ 15 నుంచి నీటి తిప్పలు.. ప్రతీ గల్లీలో జలమండలి చాటింపు

హైదరాబాద్లో డిసెంబర్ 15 నుంచి నీటి తిప్పలు..  ప్రతీ గల్లీలో జలమండలి చాటింపు

ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కష్టాలు తప్పవని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు (HMWSSB) ప్రచారం మొదలు పెట్టింది. సిటీలోని గల్లీ గల్లీలో సౌండ్ బాక్సులతో నీటి వినియోగంపై అవగాహన కల్పించేలా చాటింపు వేయిస్తోంది. అందులో భాగంగా 2026 అక్టోబర్ 24న సిటీలో ప్రచారం మొదలుపెట్టారు.

సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్లు కడిగినా, ఇంటి ముందు నీటిని వృథా చేసినా భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు.

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నీటి కొరత తీవ్రంగా ఉంది. ప్రధాన రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్న పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ కు నీళ్లందించే సింగూరు, మంజీర రిజర్వాయర్లలో నీరు అడుగంటిన పరిస్థితి. అదే విధంగా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోనూ నీటి నిల్వలు రోజు రోజుకూ తగ్గుతుండటం ఆందోళన కలిగించే అంశం. 

ALSO READ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై నిరసనలు కవర్ చేసిన... 

దీనికి తోడు వర్షపాతం సరిగా లేక భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితుల్లో రానున్న రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బంది కరమైన పరిస్థితులు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

ముఖ్యంగా బైకులు, కార్లు కడుగుతూ నీళ్లు వృధా చేసినా, ఇంటి ముందు నీళ్లు వృధాగా పోనిచ్చినా భారీ జరిమానా విధించనున్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సేవ్ వాటర్ అనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో.. జలమండలి ప్రచారం  మొదలయ్యింది.