విక్టరీ వెంకటేష్–మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజర్ అంచనాలను పెంచగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే గన్ పట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒకవైపు కుటుంబ అనుబంధాలు.. మరోవైపు క్రైమ్, గన్స్, నేరగాళ్ల ముఠా.. ఇలా భిన్నమైన అంశాలతో సాగిన ట్రైలర్ కథపై కొత్త చర్చకు తెరలేపింది. అసలు ఓ సాధారణ కుటుంబానికి నేరగాళ్ల ముఠాతో వచ్చిన గొడవేంటి? హౌస్ నెం.47లోకి అడుగుపెట్టిన తర్వాత చిట్టిబాబు జీవితంలో ఏం జరిగింది? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. దీంతో ట్రైలర్ వైరల్ అవుతుండటంతో పాటు, ‘ఆదర్శ కుటుంబం’ కథలో దాగున్న క్రైమ్ మిస్టరీపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
AK 47 క్రైమ్ మిస్టరీ..
సినిమా పేరు ‘ఆదర్శ కుటుంబం’.. కానీ ట్యాగ్‌లైన్ మాత్రం ‘AK 47’. ఒకవైపు కుటుంబ బంధాలు, మరోవైపు గన్స్, క్రైమ్, యాక్షన్.. ఈ రెండింటినీ కలిపి చూపించడంలోనే దర్శకుడు త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం కనిపిస్తోంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే, కథను కేవలం కుటుంబ వినోదానికి పరిమితం చేయకుండా క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.
చిట్టిబాబు జీవితంలో అనూహ్య మలుపు!
చిట్టిబాబు ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి. కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలనే తపన ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు అతడి జీవితాన్ని వెంటాడుతుంటాయి. భార్య చేసే చిన్న వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలు, కుటుంబ ఖర్చులు, పిల్లల బాధ్యతలు.. ఇలా రోజువారీ సమస్యల మధ్య అతడి జీవితం సాగుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో అదృష్టం కలిసిరావడంతో ఆర్థికంగా ఎదిగి, 47వ నంబర్ విల్లాలోకి అడుగుపెట్టినట్లు టీజర్, ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అయితే, కొత్త ఇంటితో పాటు అతడి జీవితంలోకి కొత్త సమస్యలు కూడా ప్రవేశిస్తాయి. నేరాలకు పాల్పడే ఓ ముఠా ఈ కుటుంబం వెంటపడటం కథను కీలక మలుపు తిప్పుతుంది.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇప్పటివరకు కుటుంబం కోసం కష్టపడిన చిట్టిబాబు.. ఒక్కసారిగా నేరగాళ్లను ఎదుర్కొనే స్థాయికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ ముఠా లక్ష్యం ఏమిటి? చిట్టిబాబు కుటుంబానికి దానితో సంబంధం ఎలా ఏర్పడింది? ఈ అంశాలే కథలోని ఉత్కంఠకు కేంద్రంగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పోలీస్ vs కుటుంబం..
ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ అధికారిగా కనిపించడం మరో ముఖ్యమైన అంశం. ఒకవైపు నేరగాళ్ల ముఠా, మరోవైపు ఆ కేసును పరిశోధించే పోలీస్ అధికారి, ఇంకోవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే చిట్టిబాబు.. ఈ మూడు కోణాలు కథలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసుల దృష్టిలో చిట్టిబాబు కుటుంబం అనుమానాస్పదంగా మారుతుందా? నేరగాళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ఆ కుటుంబం మరింత చిక్కుల్లో పడుతుందా? లేక చిట్టిబాబే ఊహించని రీతిలో ఎదురుదాడికి దిగుతాడా? ట్రైలర్ క్రైమ్, యాక్షన్ అంశాలపై అంచనాలను పెంచుతున్నప్పటికీ, కేసులోని అసలు మిస్టరీని మాత్రం పూర్తిగా బయటపెట్టడం లేదు.
►ALSO READ | OTT Review: ఓటీటీలో ఉత్కంఠరేపుతున్న తెలుగు థ్రిల్లర్.. సస్పెన్స్, ట్విస్టులతో వీకెండ్ బొనాంజా..
ట్రైలర్‌తో కథపై క్లారిటీ.. అసలు మిస్టరీ బ్యాలెన్స్!
ట్రైలర్ ద్వారా ఒక విషయం స్పష్టమవుతోంది. ‘ఆదర్శ కుటుంబం’ కేవలం కుటుంబంలో జరిగే సరదా సంఘటనలతో సాగే కథ కాదు. ఓ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా క్రైమ్ వ్యవహారంలో చిక్కుకోవడం, ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు చేసే పోరాటం, పోలీసుల దర్యాప్తు, నేరగాళ్లతో ఎదురయ్యే సంఘర్షణలు.. ఇవన్నీ కథనానికి యాక్షన్ థ్రిల్లర్ టచ్‌ను అందిస్తున్నాయి. అయితే, అసలు నేరం ఏమిటి? దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? చిట్టిబాబు కుటుంబమే ఎందుకు లక్ష్యంగా మారింది? హౌస్ నంబర్ 47కు ఈ వ్యవహారంతో ఏదైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘బ్లాస్ట్’తో పోలికలు.. అసలు విషయం ఏమిటి?
‘ఆదర్శ కుటుంబం’ కథ విషయంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తమిళంలో ఈ ఏడాది విడుదలైన ‘బ్లాస్ట్’ సినిమాతో AK 47 కథకు పోలికలు ఉన్నాయనే ప్రచారం గతంలోనే సోషల్ మీడియాలో మొదలైంది. ‘బ్లాస్ట్’ కథని గుర్తుచేసుకుంటే.. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఒక క్రిమినల్ నెట్‌వర్క్‌కు ఎదురుగా నిలబడుతుంది. కుటుంబం ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో బయట నుంచి వచ్చిన శక్తులు వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఊహించని విధంగా పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇక ఆ క్రిమినల్స్ పై ఫ్యామిలీ ఎలా తిరగబడింది? అనేదే బ్లాస్ట్ కథ. దీంతో త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌ను కొంతకాలం ఆపి స్క్రిప్ట్‌లో మార్పులు చేశారనే రూమర్స్ కూడా అప్పట్లో వినిపించాయి.
‘బ్లాక్ స్వాన్’.. త్రివిక్రమ్ ఇచ్చిన అసలు క్లూ ఇదే!
ఇటీవల ప్రమోషనల్ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ కథను వివరించేటప్పుడు ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ గురించి ప్రస్తావించారు. త్రివిక్రమ్ చెప్పిన దాని ప్రకారం.. రెండు వర్గాల మధ్య ఒక గేమ్ జరుగుతుంటే, ఆ పోరాటంతో సంబంధం లేని వ్యక్తులు కూడా దాని ప్రభావానికి గురవుతారు. అంతేకాదు.. మనం అన్ని విషయాలను ప్లాన్ చేసుకున్నామని అనుకున్న సమయంలో ఊహించని మూల నుంచి ఒక పరిణామం వచ్చి మొత్తం పరిస్థితిని తారుమారు చేయడమే ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ అని ఆయన వివరించారు.
ఇదే కాన్సెప్ట్‌ను ‘ఆదర్శ కుటుంబం’ కథకు వర్తింపజేస్తే.. సినిమా అసలు పాయింట్‌పై ఒక ఆసక్తికరమైన అంచనా ఏర్పడుతుంది. ఒకవైపు తమ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లే రెండు శక్తులు.. మరోవైపు వాటి మధ్యలో చిక్కుకునే ఒక సాధారణ కుటుంబం. ఆ కుటుంబం కథలోకి అనుకోకుండా వచ్చిన ఒక వ్యక్తి లేదా సంఘటన.. అప్పటివరకు ఉన్న గేమ్ మొత్తాన్ని మార్చేయడం. ఇదే నిజంగా సినిమా కథ అయితే.. టీజర్లో కనిపించిన అప్పుల కుటుంబం నుంచి భారీ బంగ్లా వరకు జరిగిన మార్పు కూడా కేవలం కామెడీ ట్రాక్ కాదనే అనిపిస్తుంది.
‘బ్లాస్ట్’లా ఉంటుందా? లేక త్రివిక్రమ్ మార్క్ కొత్త కథనా?
‘బ్లాస్ట్’తో ‘ఆదర్శ కుటుంబం’కు పోలికలు ఉన్నాయనే రూమర్ ఒకవైపు.. త్రివిక్రమ్ చెప్పిన ‘బ్లాక్ స్వాన్’ కాన్సెప్ట్ మరోవైపు ఉన్నాయి. పైగా టీజర్, ట్రైలర్ కూడా ఒక సాధారణ కుటుంబం కథలా మొదలై.. చివరికి డార్క్ మిస్టరీని చూపించింది. కాబట్టి బయటకు కనిపిస్తున్న కొన్ని అంశాల ఆధారంగా రెండు సినిమాలను పోల్చడం సులభమే. కానీ కథలోని పాత్రలు, సంఘర్షణ, ట్విస్టులు, క్లైమాక్స్ వంటి అసలు అంశాలు బయటకు రాకుండా ఇప్పుడే ‘ఇదే కథ’ అని చెప్పడం మాత్రం తొందరపాటు అవుతుంది.
ఎందుకంటే త్రివిక్రమ్ చెప్పిన ‘బ్లాక్ స్వాన్’ పాయింట్లోనే సినిమాకు.. అసలు ట్విస్ట్ దాగి ఉండే అవకాశం ఉంది. మనం ఊహిస్తున్నది ఒకటైతే.. సినిమా మరో దిశలో వెళ్లేలా ఆయన స్క్రీన్‌ప్లేను డిజైన్ చేసి ఉండొచ్చు. మొత్తానికి.. అప్పులతో మొదలయ్యే ఒక సాధారణ కుటుంబం జీవితంలోకి ఒక ఊహించని వ్యక్తి లేదా సంఘటన ఎంట్రీ ఇస్తే.. ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారుతుంది? అన్నదే ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’పై ఉన్న అతిపెద్ద ప్రశ్న.
