Bhuvneshwar Kumar: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లోకి భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. ఐపీఎల్లో వరుసగా రెండు సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టులోకి ఎంపికైన 36 ఏళ్ల భువీకి, ఈ రీ-ఎంట్రీ మ్యాచ్ ఏమాత్రం ఆశాజనకంగా కొనసాగలేదు. తొలి టీ20లో తన 4 ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 49 రన్స్ సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అంతటి అనుభవం ఉన్న బౌలర్ ఈ మ్యాచ్‌లో రెండు నో-బాల్స్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో భువీతో సుదీర్ఘకాలం కలిసి పని చేసిన మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) క్రిక్‌బజ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
* నో-బాల్స్ ఎఫెక్ట్: సాధారణంగా భువనేశ్వర్ కుమార్ అసలు నో-బాల్స్ వేయడు.. కానీ ఈ మ్యాచ్‌లో రెండు నో-బాల్స్ వేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. రీ-ఎంట్రీ మ్యాచ్ కావడంతో ఒత్తిడికి గురై ఉండవచ్చు లేదా అనుకున్నంత స్థాయిలో ఇంకా ఫిట్‌గా సిద్ధంగా లేకపోవచ్చని కార్తీక్ అభిప్రాయపడ్డారు.
* ఓవర్ల విశ్లేషణ: భువీ వేసిన 1వ, 4వ ఓవర్లు చాలా అద్భుతంగా కొనసాగినప్పటికీ, 2, 3వ ఓవర్లలో పడిన నో-బాల్స్ వల్లే ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో విమర్శకుల నుంచి భువనేశ్వర్ కుమార్‌కు దినేష్ కార్తీక్ మద్దతు ప్రకటించాడు. చాలా మంది అభిమానులు, విమర్శకులు భువీని తప్పుపట్టవచ్చు, కానీ నాలుగేళ్ల తర్వాత ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇది.. కాబట్టి అతనికి కొద్దిగా సమయం ఇవ్వండి.. నో-బాల్స్ వేసే అలవాటును కొనసాగించకూడదని భువీకి కూడా తెలుసు, తన సామర్థ్యానికి తగ్గట్టు ఆడాడా అంటే ఖచ్చితంగా లేదు, కానీ అతనికి పుంజుకునే సత్తా ఉందని డీకే స్పష్టం చేశారు.
