జామియా మిలియా వర్సిటీలో హై టెన్షన్.. క్లాసులన్నీ ఆన్‌లైన్‌కు మార్పు

జామియా మిలియా వర్సిటీలో హై టెన్షన్.. క్లాసులన్నీ ఆన్‌లైన్‌కు మార్పు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో హై టెన్షన్ నెలకొంది. 2006లో రద్దు చేయబడిన విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 12 నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం (అక్టోబర్ 24) విద్యార్థుల నిరసన ఘర్షణకు దారి తీసింది. 

నిరసనకారుల టెంట్లను భద్రతా సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. శాంతియుతంగా దాడి చేస్తోన్న తమపై సెక్యూరిటీ గార్డులు దాడి చేశారని నిరసనకారులు ఆరోపించారు. 

క్యాంపస్‎లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా వర్సిటీ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కోర్సుల తరగతులను తక్షణమే ఆన్‌లైన్ విధానంలోకి మారుస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని తరగతులను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని డీన్లు, అధ్యాపకులను వర్సిటీ ఆదేశించింది. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను పునరుద్ధరిస్తామని వర్శిటీ యంత్రాగం హామీ ఇచ్చింది. విద్యార్థులు ఆందోళనలు విరమించాలని కోరింది. 

కాగా, 2006లో క్యాంపస్ హింస కారణంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలను రద్దు చేశారు. దీంతో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను తిరిగి నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే సస్పెండ్ చేసిన విద్యార్థులపై చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.