Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10: ముకేష్ గౌడకు నాగార్జున వార్నింగ్.. బోరున ఏడ్చేసిన వర్షిణి!

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10: ముకేష్ గౌడకు నాగార్జున వార్నింగ్.. బోరున ఏడ్చేసిన వర్షిణి!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. కంటెస్టెంట్లకు నాగార్జున క్లాస్‌లు, అదిరిపోయే కౌంటర్లు, ఊహించని ట్విస్టులతో ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు.  లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 48వ రోజు ( అక్టోబర్ 24, 2026 ) ప్రోమో ఎపిసోడ్  కూడా అదే రేంజ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు నరేశ్, దేబ్జానీల ఆటతీరును ఆకాశానికి ఎత్తేసిన నాగార్జున.. మరోవైపు ముకేష్ గౌడ, వర్షిణిలకు గట్టిగానే క్లాస్ పీకారు. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

ముకేష్ గౌడకు నాగ్ గట్టి వార్నింగ్..

ఈ వారం శివతో జరిగిన వివాదంలో ముకేష్ గౌడ మాట్లాడిన మాటలను నాగార్జున సీరియస్‌గా తీసుకున్నారు.. ముకేష్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయగా, గతంలో అతడిని జెంటిల్‌మెన్‌గా భావించానని నాగ్ గుర్తుచేశారు. వర్షిణి కూడా అలాగే అనుకుందని చెబుతూ, అతడు ఉపయోగించిన అభ్యంతరకర పదాలను వీడియో రూపంలో చూపించారు. 'ఏమైంది నీ క్యారెక్టర్? ఏమైంది నీ జెంటిల్‌మెన్ బిహేవియర్?' అంటూ క్లాస్ పీకారు. భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు కూడా మాటలను నియంత్రించుకోవాలని సూచించారు. దీంతో ముకేష్ వ్యవహారం హౌస్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

వర్షిణికి కౌంటర్..

ఇక నీతూను ఉద్దేశించి వర్షిణి చేసిన వ్యాఖ్యలను నాగార్జున ప్రస్తావించారు. 'నీతూ.. నువ్వేం పీకుతావ్ అన్నావ్ కదా.. గేమ్ ఆడి ఏం పీకిందో చూపించింది కదా' అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆటలో సవాళ్లు విసరడం మాత్రమే కాదు.. వాటిని ఆచరణలో చూపించాలని పరోక్షంగా చురకలంటించారు. మరోవైపు షాలిని తిరిగి రావడం రాంప్రసాద్‌కు ఇష్టమేనా అని అడగ్గా, తనకు నచ్చలేదని ఆయన స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

నరేశ్, దేబ్జానీలకు ప్రశంసలు..

మరోవైపు నరేశ్ ఆటతీరును నాగార్జున సరదాగా ప్రశంసిస్తూ.. అతడి తెలివితేటలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేబ్జానీ కూడా కళ్లలో నీళ్లు తిరిగినా ఆటలో వెనక్కి తగ్గలేదని మెచ్చుకున్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని అభినందించారు, హౌస్ లో అందరూ గర్వపడేలా ఆడుతున్నావని ప్రోత్సహించారు.

మొత్తానికి ఈ ప్రోమోలో ప్రశంసలు, ఘాటు విమర్శలు, వ్యక్తిగత విభేదాలు అన్నీ కలగలిసి కనిపిస్తున్నాయి. మరి నాగార్జున క్లాస్ తర్వాత ముకేష్, వర్షిణి తమ ఆటతీరును మార్చుకుంటారా? నీతూ తన జోరును కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే..