గడువు ముగిసిన ఆహార పదార్థాల కలకలం.. బ్లింకిట్‌కు షాక్ ఇచ్చిన FDA.. లైసెన్స్ సస్పెండ్!

 గడువు ముగిసిన ఆహార పదార్థాల కలకలం.. బ్లింకిట్‌కు షాక్ ఇచ్చిన FDA.. లైసెన్స్ సస్పెండ్!

గడువు ముగిసిన, పాడైపోయిన, అమ్మకానికి పనికిరాని ఆహార పదార్థాల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), బ్లింకిట్‌కు చెందిన భివండి వేర్ హౌస్  లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. 

అక్టోబర్ 21న అధికారులు ఈ వేర్ హౌస్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.32.71 లక్షల విలువైన 18,405 ఆహార ఉత్పత్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. గడువు ముగిసిన, పాడైపోయిన లేదా అమ్మకానికి పనికిరావని గుర్తించిన ఈ వస్తువులు ఎక్కడికి వెళ్లాయి, వాటిని నిజంగా ధ్వంసం చేశారా అనే విషయాలకు  బ్లింకిట్ అధికారులు సరైన వివరాలు లేదా ఆధారాలు చూపించలేకపోయారని FDA పేర్కొంది.

అమ్మకానికి పనికిరాని ఈ ఆహార పదార్థాలను సరిగ్గా ధ్వంసం చేయకుండా, మళ్లీ మార్కెట్‌లోకి పంపించి ప్రజలకు విక్రయించే అవకాశం ఉందని అధికారులు మండిపడ్డారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం కలగవచ్చని భావించి, భివండి వేర్ హౌస్  కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.

బ్లింకిట్ సిబ్బందిపై కేసు
లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, ఈ వ్యవహారంపై FDA అధికారులు భివండి తాలూకా పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు  చేయగా.... బ్లింకిట్‌ కీలక అధికారులు, ఫెసిలిటీ మేనేజర్లు, అలాగే పనికిరాని సరుకును పారవేసే విక్రేతలపై ఈ కేసు నమోదైంది.

గడువు ముగిసిన ఆహార పదార్థాలపై FDA నిఘా
మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే ఆధ్వర్యంలో, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అక్రమంగా తిరిగి మార్కెట్‌లోకి పంపిస్తున్నారనే అనుమానాలపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

ALSO READ : పోస్టాఫీసు RD vs PPF: నెలకు రూ.10వేలు సేవ్ చేసేటోళ్లకు ఏది బెటర్?

ఈ క్రమంలో గిడ్డంగులు, డార్క్ స్టోర్లు, వ్యర్థాల పారవేత కేంద్రాలపై దృష్టి పెట్టారు. కొన్ని ఆహార కంపెనీలు, సరఫరాదారులు ధ్వంసం చేయాల్సిన సరుకును సరిగ్గా పారవేయకుండా స్థానిక వ్యాపారులకు, దుకాణాలకు డిస్కౌంట్ కింద పంపిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం.

గడువు ముగిసిన లేదా అమ్మకానికి పనికిరాని ఆహార పదార్థాలను ధ్వంసం చేయాల్సిన చోట, వాటిని తిరిగి మార్కెట్‌లోకి పంపిస్తున్నారా అనే అంశంపై మహారాష్ట్ర FDA కఠిన చర్యలు చేపట్టింది.