ప్రపంచ ఇంటర్నెట్‌కు ఇరాన్ ముప్పు.. సముద్రంలోని కేబుళ్లు కట్ చేస్తే భారత్‌పై ప్రభావం ఉంటుందా?

 ప్రపంచ ఇంటర్నెట్‌కు ఇరాన్ ముప్పు..  సముద్రంలోని కేబుళ్లు కట్ చేస్తే భారత్‌పై ప్రభావం ఉంటుందా?

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను తెంచేస్తామని  ఇరాన్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్‌పై దాడులు చేస్తే, గల్ఫ్ ప్రాంతంలో సముద్రం అడుగున ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు   ఇరాన్ భద్రతా అధికారులు  వెల్లడించారు.

ఈ కేబుళ్లు దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోకపోవచ్చు. కానీ  గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్  తగ్గడం, ఆన్‌లైన్ పేమెంట్స్  ఆలస్యం కావడం, క్లౌడ్ సేవలకు అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ యుద్ధ పరిస్థితుల్లో కేబుళ్లను రిపేర్ చేయడం కూడా కష్టమవుతుంది.

సముద్రగర్భ కేబుళ్లు ఎందుకు అంత ముఖ్యం?
ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఇంటర్నెట్ డేటా ట్రాన్స్ఫర్ సముద్రం అడుగున ఏర్పాటు చేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు చాలా కీలకం. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ప్రకారం, ప్రపంచ అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 99 శాతం ఈ కేబుళ్ల ద్వారానే ప్రయాణిస్తుంది.

హోర్ముజ్ జలసంధి వద్ద ఏముంది?
ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి గల్ఫ్ ప్రాంతాన్ని ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. ఈ సముద్ర మార్గం కింద పలు అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుళ్లు ఉన్నాయి.

అయితే, హోర్ముజ్ జలసంధి నుండి వెళ్లే కేబుళ్లు ప్రపంచ అంతర్జాతీయ ఇంటర్నెట్ సామర్థ్యంలో ఒక శాతం కంటే తక్కువ భాగాన్ని మాత్రమే మోస్తాయి. అందువల్ల అక్కడి కేబుళ్లు దెబ్బతిన్నంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోతుందని చెప్పలేం. కానీ గల్ఫ్ దేశాలకు మాత్రం ఈ అంతరాయం ఎక్కువగా ఉండవచ్చు.

ALSO READ : డేంజర్ బెల్స్: తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ ఉష్ణోగ్రతలు..

కేబుళ్లు తెగిపోతే ఏం జరుగుతుంది?
ఒక కేబుల్ దెబ్బతింటే సాధారణంగా ఇంటర్నెట్ సంస్థలు డేటాను మరో కేబుల్ లేదా ప్రత్యామ్నాయ నెట్‌వర్క్ ద్వారా పంపిస్తాయి. అందువల్ల ఒక కేబుల్ తెగిపోయినా చాలా సందర్భాల్లో వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఒకేసారి పలు కేబుళ్లు దెబ్బతింటే పరిస్థితి మారుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై డేటా భారం పెరుగుతుంది. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గవచ్చు, వెబ్‌సైట్లు నెమ్మదిగా తెరుచుకోవచ్చు, ఆన్‌లైన్ చెల్లింపులు, ఈ-కామర్స్, క్లౌడ్ సేవల్లో అంతరాయాలు ఏర్పడవచ్చు. ప్రత్యేకంగా గల్ఫ్ ప్రాంతంలో పనిచేసే బ్యాంకులు, వ్యాపార సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

ఎర్ర సముద్రం కూడా కీలకమే!
గల్ఫ్ ప్రాంతంతో పాటు ఎర్ర సముద్రం కింద ఉన్న కేబుళ్లు కూడా అంతర్జాతీయ ఇంటర్నెట్‌కు చాలా ముఖ్యమైనవి. యూరప్, ఆసియా, తూర్పు ఆఫ్రికా మధ్య డేటా ప్రయాణించడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది. హోర్ముజ్ జలసంధితో పోలిస్తే ఎర్ర సముద్రం నుంచి వెళ్లే కేబుళ్లకు అంతర్జాతీయ ఇంటర్నెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందువల్ల అక్కడ ఒకేసారి చాల  కేబుళ్లు దెబ్బతింటే ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చు.

 భారతదేశంపై ప్రభావం ఉంటుందా?
భారతదేశం కూడా అంతర్జాతీయ ఇంటర్నెట్ కోసం సముద్రగర్భ కేబుళ్లపై ఆధారపడుతోంది. 2022లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో 14 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా సుమారు 17 సముద్రగర్భ కేబుళ్లు తీరానికి చేరుతున్నాయి. వీటిలో చాలా ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఉన్నాయి.

కాబట్టి గల్ఫ్ లేదా ఎర్ర సముద్రంలో కీలకమైన కేబుళ్లు దెబ్బతింటే, భారతదేశానికి వచ్చే లేదా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే ఇంటర్నెట్ డేటాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, ఎంత మేరకు ప్రభావం ఉంటుందనేది ఏ కేబుళ్లు దెబ్బతిన్నాయి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎంత సామర్థ్యం అందుబాటులో ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోతుందని చెప్పడానికి ఆధారాలు లేవు.

కేబుళ్ల మరమ్మతులకు ఎక్కువ సమయం
సముద్రగర్భ కేబుల్ తెగిపోయినప్పుడు ముందుగా దెబ్బతిన్న ప్రాంతాన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక మరమ్మతు నౌక అక్కడికి చేరుకుని, సముద్రం అడుగున ఉన్న కేబుల్‌ను పైకి లాగుతుంది. దెబ్బతిన్న భాగాన్ని తొలగించి, కొత్త కేబుల్ భాగాన్ని జత చేసి, తిరిగి సముద్రంలోకి దింపుతుంది.

నీటి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరమ్మతు పనులకు సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజులు పట్టవచ్చు. అయితే, నౌకలు సంఘటనా స్థలానికి చేరుకోవడం, అనుమతులు పొందడం వంటి అంశాలను కలిపితే మొత్తం సమయం చాలా పెరగవచ్చు. అమెరికా నేవీ అధికారి రియర్ అడ్మిరల్ మైక్ బ్రూక్స్ తెలిపిన వివరాల ప్రకారం, 2024లో ఒక కేబుల్ మరమ్మతుకు సగటున 51 రోజులు పట్టింది.

యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఈ పనులు మరింత కష్టమవుతాయి. నౌకల భద్రత, సముద్రంలో మందుపాతరల ప్రమాదం, అధిక బీమా ఖర్చులు, తీరప్రాంత దేశాల అనుమతులు వంటి సమస్యల వల్ల మరమ్మతులు వారాల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.