కుక్క కాట్లతో వణికిపోయిన ముంబై సిటీ : గంటకు 17 కేసులతో కొత్త రికార్డ్

కుక్క కాట్లతో వణికిపోయిన ముంబై సిటీ : గంటకు 17 కేసులతో కొత్త రికార్డ్

ముంబైలో వీధి కుక్కల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతున్నాయి. 2025లో  ముంబై నగరంలో ఏకంగా 1,54,017 కుక్కకాటు ఘటనలు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 421 మంది, ప్రతి గంటకు దాదాపు 17 మంది కుక్కకాటుకు గురయ్యారు. 2021లో నమోదైన ఘటనలతో పోలిస్తే కుక్కకాటు ప్రమాదాల సంఖ్య దాదాపు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే వీధి కుక్కలను నియంత్రించేందుకు, వాటికి రేబీస్ టీకాలు వేసేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పలు కార్యక్రమాలు చేపడుతోంది. అయినసరే కుక్కకాటు ఘటనలు పెరుగుతుండటంతో ఈ కార్యక్రమాలు ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఐదేళ్లలో 5.29 లక్షలకు పైగా  
సమాచార హక్కు చట్టం (RTI) కింద సేకరించిన వివరాల ప్రకారం, 2021 నుంచి 2025 వరకు ముంబైలో మొత్తం 5,29,650 కుక్కకాటు ఘటనలు నమోదయ్యాయి.

ఇక ఏడాది పరంగా చూస్తే 2021లో  79,252 కేసులు, 2022లో 1,06,797 కేసులు, 2023లో  61,332 కేసులు, 2024లో  1,28,252 కేసులు, 2025లో 1,54,017 కేసులు నమోదయ్యాయి. 

2023లో కుక్కకాటు ఘటనలు తగ్గినప్పటికీ, ఆ తర్వాత రెండేళ్లలో మళ్లీ భారీగా పెరిగాయి. ముఖ్యంగా 2025లో నమోదైన కేసులు గత ఐదేళ్లలోనే అత్యధికం. ఈ గణాంకాలపై చేతన్ కోఠారి ఆందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడం, రేబీస్ టీకాలు వేయడం వంటి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయాలని ఆయన సూచించారు.

కుక్కకాటు వల్ల మరణాలు
RTI ద్వారా అందిన సమాధానంలో, ముంబైలో కుక్కకాటు వల్ల లేదా కుక్కకాటు తర్వాత వచ్చే రేబీస్ వ్యాధి కారణంగా మరణాలు నమోదుకాలేదని BMC తెలిపింది. అయితే, కుక్కకాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేబీస్ టీకాల కొరతపై వస్తున్న వార్తలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని కోఠారి పేర్కొన్నారు.

రేబీస్ విషయంలో జాగ్రత్త
 వెటర్నరీ ఆసుపత్రికి చెందిన డాక్టర్  రేబీస్ ప్రమాదాలపై హెచ్చరించారు. కుక్క కాటు మాత్రమే కాకుండా, వ్యాధి సోకిన జంతువు గోళ్ల ద్వారా గీత పడినా ప్రమాదం ఉండవచ్చని  వివరించారు. పెంపుడు కుక్కలు, పిల్లులకు కూడా అవసరమైన టీకాలు వేయించడం ముఖ్యమని సూచించారు. కుక్క కరిచినా, గోకినా లేదా దాని లాలాజలం గాయమైన చర్మానికి తగిలినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబీస్ నివారణకు అవసరమైన టీకాలు, ఇతర చికిత్సలను ఆలస్యం చేయకూడదు.

మూడేళ్లలో 1.35 లక్షల కుక్కలకు  
వీధి కుక్కలను  నియంత్రించేందుకు BMC కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,000 కుక్కలకు, రాబోయే మూడేళ్లలో మొత్తం 1,35,000 కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం కోసం ముంబై వెటర్నరీ కాలేజీతో సహా తొమ్మిది సంస్థలను ఎంపిక చేసింది. మూడేళ్ల కార్యక్రమానికి సుమారు రూ.23 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

ముంబైలో 90 వేలకుపైగా
హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ 2024లో నిర్వహించిన సర్వే ప్రకారం, ముంబైలో సుమారు 90,757 వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేశారు. మురికివాడ ప్రాంతాల్లో ప్రతి చదరపు కిలోమీటరుకు సుమారు 224 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. అంచనా వేసిన మొత్తం కుక్కల్లో 33,671 కుక్కలకు ఇప్పటికే సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరిగాయి.

వీధి కుక్కలను నియంత్రించకపోతే భవిష్యత్తులో వాటి సంఖ్య 4,48,947కు చేరవచ్చని BMC అంచనా వేసింది. అలాగే, నగరంలో 160 టీకా కేంద్రాలు ఉన్నాయని, 2026 నాటికి 1,00,235 వీధి కుక్కలకు రేబీస్ నిరోధక టీకాలు వేసినట్లు తెలిపింది.

వీధి కుక్కల కోసం ప్రత్యేక ఆశ్రయాలు
స్కూల్స్, కాలేజెస్, ఆసుపత్రులు, క్రీడా మైదానాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను ప్రత్యేక ఆశ్రయాలకు తరలించాలని BMC యోచిస్తోంది. సాధారణంగా కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు వేసిన తర్వాత వాటిని తిరిగి పట్టుకున్న ప్రాంతాల్లో వదిలేస్తారు. అయితే, సున్నితమైన ప్రాంతాల నుంచి పట్టుకున్న కుక్కలను తిరిగి అక్కడ వదలకుండా ఆశ్రయాల్లో ఉంచాలని ప్రతిపాదిస్తున్నారు.