హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులపై డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల స్కామ్ పేరుతో ఆరోపణలు చేస్తున్న సుధీర్ రెడ్డి, గతంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
లింగోజిగూడలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సుధీర్ రెడ్డి తన ఇంట్లో పనిచేసే సిబ్బంది, ఫామ్‌హౌస్ వర్కర్లు, డ్రైవర్ల పేర్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయింపులు చేయించారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన పట్టాల ఆధారాలున్నాయ తెలిపారు.
అర్హులైన పేదలకు అందాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పక్కదారి పట్టించారని ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే లెటర్‌హెడ్‌ను ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఎల్బీనగర్ పరిధిలోని నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో తన ఇంట్లో, ఫామ్‌హౌస్‌లో, స్నేహితుల ఇళ్లలో పనిచేసే సిబ్బందితో పాటు పీఏలు, ఫొటోగ్రాఫర్లు, ఫామ్‌హౌస్ విక్రయించిన యజమానులకు కూడా ఇళ్లు ఇప్పించారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ఇళ్లను కేటాయించడమే కాకుండా, వాటిని విక్రయించినట్లు కూడా ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అంశాలపై సుధీర్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. తన మీడియా సమావేశంలో చూపించిన ఆధారాల్లో తప్పులు ఉన్నాయని భావిస్తే వాటిని నిరూపించాలని, లేదంటే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. రాజకీయ విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన వ్యవహారాలపై కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు.
