మహిళల సాధికారత గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ తోటి మహిళల ఎదుగుదలకు అడ్డుపడే వారి గురించి మాత్రం కొందరే గట్టిగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఇదే అంశంపై మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మహిళలు ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిస్తూనే, ఇతర మహిళల జీవితాలను దెబ్బతీసే స్వార్థపూరిత మనస్తత్వంపై ఆమె తీవ్రంగా స్పందించారు.
మహిళల కోసం స్ట్రాంగ్ మెసేజ్!
హైదరాబాద్లో నిర్వహించిన 'ఫెస్టివల్ ఫర్ జాయ్స్' ఐదో వార్షికోత్సవ వేడుకల్లో ఉపాసన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాంకర్ సుమ కనకాలతో కలిసి వేదికను పంచుకున్న ఆమె.. మహిళల ఎదుగుదల, పరస్పర సహకారం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తమ విజయాల కోసం ఇతర మహిళలను తొక్కేయాలని చూసేవారు సమాజంలో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
'మీ సక్సెస్ కోసం లేదా ఒక వీక్ మగాడిని సంతోషపెట్టడం కోసం మరో మహిళ జీవితాన్ని అణిచివేయాలని చూడకండి' అంటూ ఉపాసన ఘాటుగా హెచ్చరించారు. ఒక మహిళ సాధించిన విజయానికి మరో మహిళ కన్నీళ్లు కారణం కాకూడదనే సందేశాన్ని ఆమె తన మాటలతో బలంగా వినిపించారు.
ఆ పిల్లల పరిస్థితికి కారణం అదేనా?
సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో సహాయం పొందుతున్న పిల్లల పరిస్థితిని కూడా ఉపాసన ప్రస్తావించారు. కొందరు మహిళలు తమ స్వార్థం కోసం ఇతరులకు చేసే అన్యాయాలు అమాయక పిల్లల జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
సుమపై ప్రశంసలు..
ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ కాన్ఫిడెన్స్, విజయాలను ఉపాసన ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు ఒకరిని మరొకరు కిందకు లాగడం కాకుండా, కలిసి ఎదిగే సంస్కృతిని అలవర్చుకోవాలని సూచించారు. మొత్తానికి ఉపాసన వ్యాఖ్యలు మహిళల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం గురించి మరోసారి చర్చకు తెరలేపాయి. వ్యక్తిగత విజయాల కంటే మానవత్వం, ఇతరుల పట్ల గౌరవం ముఖ్యమనే ఆమె సందేశం ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..
