మీ ఉప్పులో ఉప్పుందా.. పప్పులో పప్పుందా..? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎక్కడ చూసినా కల్తీ. గల్లీలో తయారయ్యే ఆహార పదార్థాల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు కల్తీకి ఏవీ మినాహాయింపు కావు. వంద శాతం ప్యూర్ అంటూ వినియోగదారులను బోల్తా కొట్టించే కంపెనీల వ్యవహారానికి బ్రిటానియా కేసు ఒక ఉదాహరణ. అదేంటో చూద్దాం.
100 శాతం హోల్ వీట్ బ్రెడ్.. అంటే గోధుమ పిండితో చేసిన బ్రెడ్.. అని తప్పుడు ప్రకటనలు చేసినందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్‌పై కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) లక్ష రూపాయల జరిమానా విధించింది. అక్టోబర్ 22, 2026న జారీ చేసిన ఆదేశాల్లో సంస్థ వెంటనే ఆ ప్రకటనలు ఆపాలని, 15 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ బ్రెడ్‌లో కేవలం 62 శాతం మాత్రమే హోల్ వీట్ ఫ్లోర్ ఉందని సీసీపీఏ తేల్చింది.
ప్యాకెట్ ముందు భాగంలో 100% హోల్ వీట్ బ్రెడ్, 0% మైదా అని పెద్ద అక్షరాల్లో రాసి ఉంది. వినియోగదారులు ఇది పూర్తిగా గోధుమ పిండితో తయారైనదని అనుకునేలా చేసింది. కానీ వాస్తవానికి 62 శాతం హోల్ వీట్ ఫ్లోర్, మిగిలిన 38 శాతం నీరు, ఈస్ట్, వీట్ బ్రాన్, ఇతర పదార్థాలు ఉన్నాయి.
సీసీపీఏ స్వయంగా పరీక్షించి 2025 జనవరి 13న నోటీసు జారీ చేసింది. బ్రిటానియా 100% అనేది పిండి ఆధారంగా చెప్పినదని, మైదా లేదని తెలియజేయడమే తమ ఉద్దేశమని సమాధానం ఇచ్చింది. కానీ సీసీపీఏ ఈ వాదనను తోసిపుచ్చింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం హోల్ వీట్ బ్రెడ్ అని పేర్కొనాలంటే కనీసం 75 శాతం హోల్ వీట్ ఫ్లోర్ ఉండాలి. బ్రిటానియా ఉత్పత్తి ఆ పరిమితిని చేరుకోలేదు.
2025 మే 28న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 100% అనే పదం వాడకూడదని సలహా ఇచ్చినా, బ్రిటానియా వెబ్‌సైట్, ప్రమోషనల్ మెటీరియల్‌లో కొనసాగించింది. ప్యాకెట్ వెనుక Made from 100% Whole Wheat Flour on Flour Basis అని చిన్న అక్షరాల్లో రాసినా, అది ముందు ఉన్న పెద్ద ప్రకటన తప్పుదోవ పట్టించడమేనని సీసీపీఏ పేర్కొంది.
వినియోగదారుల రక్షణ చట్టం 2019 సెక్షన్ 2(28), 2(47) ప్రకారం ఇది తప్పుడు ప్రకటన, మోసపూరిత వ్యాపార పద్ధతి అని తేల్చింది. సీసీపీఏ ఆదేశాల ప్రకారం బ్రిటానియా వెంటనే అన్ని ప్రకటన ఆపాలి, రూ.1 లక్ష జరిమానా చెల్లించాలి, 15 రోజుల్లోపు కంప్లయన్స్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది.
