పూర్వకాలంలో మాంత్రికులు, రసాయన శాస్త్రవేత్తలు మెర్క్యూరీని బంగారంగా మార్చాలని నానా తంటాలు పడేవారు. అదంతా కేవలం ఒక కల్పిత కథ.. మూఢనమ్మకం అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అసాధ్యం సుసాధ్యమైంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సికోకు చెందిన 'మరథాన్ ఫ్యూజన్' అనే టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ.. న్యూక్లియర్ ఫ్యూజన్ సహాయంతో పాదరసాన్ని నిజమైన బంగారంగా మార్చి సంచలనం సృష్టించింది. ఈ అద్భుతమైన ప్రయోగం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ ప్రయోగం వెనుక రహస్యం ఏమిటి?
ఈ అద్భుతం వెనుక ఎలాంటి మాయాజాలం లేదు.. పూర్తిగా శాస్త్ర విజ్ఞానమే ఉంది. సాధారణ రసాయన చర్యల ద్వారా పరమాణువులను మార్చడం అసలు సాధ్యం కాదు. ఎందుకంటే అవి కేవలం ఎలక్ట్రాన్లను మాత్రమే మారుస్తాయి. కానీ 'మరథాన్ ఫ్యూజన్' సంస్థ శాస్త్రవేత్తలు నూక్లియెస్ పై నేరుగా దాడి చేసే 'ట్రాన్స్‌మ్యుటేషన్' అనే అణు ప్రక్రియను గోల్డ్ తయారీకి ఉపయోగించారు.
ఈ ప్రయోగంలో భాగంగా వారు 'పాదరసం-198' అనే సాధారణ ఐసోటోప్‌ను తీసుకున్నారు. దీనిపై డ్యూటీరియం-ట్రిటియం ఫ్యూజన్ చర్యల ద్వారా అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్లను ప్రయోగించారు. దీని కారణంగా పాదరసం పరమాణువు ఒక న్యూట్రాన్‌ను గ్రహించి 'పాదరసం-197'గా మారుతుంది. ఈ కొత్త అస్థిర ఐసోటోప్ సహజంగానే క్షీణించి.. ఎలాంటి రేడియోధార్మికత లేని 100% స్వచ్ఛమైన 'బంగారం-197'గా రూపాంతరం చెందుతుంది.
ఈ అక్టోబర్ 21న మారథాన్ ఫ్యూజన్ సంస్థ తమ ప్రయోగ విజయవంతమైనట్లు అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు 2025లో ప్రపంచ ప్రఖ్యాత 'సీఈఆర్ఎన్' (CERN) సంస్థ నెలకొల్పిన రికార్డును తమ ఉత్పత్తి రేటుతో 10 రెట్లు అధిగమించినట్లు ప్రకటించారు. సీఈఆర్ఎన్ పరిశోధకులు లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ద్వారా కొన్ని మైక్రోగ్రాముల అస్థిర బంగారాన్ని మాత్రమే సృష్టించగలిగారు. కానీ ఈ స్టార్టప్ మాత్రం చాలా స్థిరమైన బంగారాన్ని తయారు చేసినట్లు చెబుతోంది. అయితే కచ్చితంగా ఎంత బంగారం తయారు చేశారనే లెక్కలను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.
బంగారమే కాదు.. క్యాన్సర్ వైద్యానికి ఉపయోగపడే మూలకాలు:
ఈ ప్రయోగంలో కేవలం బంగారం మాత్రమే కాదు.. వైద్య రంగానికి ఎంతో కీలకమైన కాపర్ ఐసోటోప్స్ (Copper-64, Copper-67) కూడా తయారయ్యాయి. ఈ రేడియోధార్మిక మూలకాలను వైద్య రంగంలో మెడికల్ ఇమేజింగ్, టార్గెటెడ్ క్యాన్సర్ చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే అరుదైన, ఖరీదైన వైద్య వస్తువులను తయారు చేసే పరిశ్రమలుగా మారే అవకాశం ఉంది.
బంగారపు ధరలు పడిపోతాయా?
ఈ వార్త వినగానే బంగారం ధరలు పడిపోతాయా అని అందరికీ సందేహం రావడం సహజం. అయితే ఇప్పట్లో గోల్డ్ రేట్లు పడిపోయే అవకాశం లేదు. ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాణిజ్య స్థాయిలో అమలు చేయడం అంత ఈజీ విషయం కాదు. పాదరసం, అణు రేడియేషన్‌తో కూడుకున్న ఈ పనులకు అత్యంత ఖరీదైన భద్రతా చర్యలు, ప్రత్యేకమైన వాతావరణం అవసరం. ప్రతి ఔన్స్ బంగారంలోనూ రేడియోధార్మికత ఆనవాళ్లు లేకుండా పరీక్షించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ల్యాబ్‌లో తయారైన బంగారం వెంటనే మన నగల దుకాణాలకు వచ్చేయదు. సో ల్యాబ్ గోల్డ్ రాకకు ఇంకా కొంత సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
