కొల్లాం: కేరళలోని కొల్లాంలో నకిలీ నోట్ల ప్రింటింగ్ కేంద్రం గుట్టు రట్టు చేశారు పోలీసులు. అక్కడ రూ.2.5 కోట్ల విలువైన నోట్ల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కొల్లాంలోని వాడి ప్రాంతానికి చెందిన సిబియన్ కనిపించడం లేదంటూ ఆయన భార్య టిన్సీ అక్టోబర్ 16న పల్లితొట్టం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో సిబియన్‌ను అస్రామం ప్రాంతంలో కొందరు అపహరించి, ఆయన బంగారు ఆభరణాలను తీసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆదర్శ్ అనే వ్యక్తి సిబియన్‌ను ఓ ప్రాంతానికి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, కొంతకాలానికి సిబియన్ స్వయంగా తిరిగి వచ్చి పోలీసులకు జరిగిన విషయాలను వివరించారు. అనంతరం ఆయన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించగా.. హవాలా లావాదేవీలు, ఇతర అనధికార కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో శుక్రవారం రాత్రి కొల్లాం సిటీ పోలీసులు, జిల్లా యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (డాన్‌సాఫ్) బృందం కలిసి సిబియన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో డిజిటల్ ప్రింటర్, రూ.500 నోట్ల పరిమాణంలో కత్తిరించిన కాగితాల కట్టలు, కరెన్సీ లెక్కించే యంత్రం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉపయోగించి సుమారు రూ.2.5 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లను తయారు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఇంట్లో 43 సవర్ల బంగారు ఆభరణాలను కూడా గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అట్టింగల్‌కు చెందిన రవి అనే వ్యక్తి.. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించినట్లు అనుమానిస్తున్న సామగ్రిని సిబియన్‌కు అందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు ప్రతిగా రూ.30 లక్షలు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని ఓ పోలీసు అధికారి తెలిపారు.ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు భావిస్తున్న రవి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.
