బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం: జేడీయూ నుంచి ఎమ్మెల్యే ఛోటే సర్కార్ సస్పెండ్

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం: జేడీయూ నుంచి ఎమ్మెల్యే ఛోటే సర్కార్ సస్పెండ్

పాట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోకామా ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత అనంత్ కుమార్ సింగ్ (చోటా సర్కార్)ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు జేడీయూ సస్పెండ్ చేసింది. అనంత్ కుమార్ సింగ్‎తో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే నీలం దేవిని కూడా ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో బహిష్కరణ వేటు వేసినట్లు జేడీయూ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే, బీహార్ శాసన మండలి ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేశారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం అనంత్ సింగ్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని బీహార్ శాసనసభ స్పీకర్‌కు జేడీయూ సిఫార్సు చేసింది. 

ఎవరీ అనంత్ కుమార్ సింగ్..?

బీహార్ రాజకీయాల్లో అనంత్ కుమార్ సింగ్ సీనియర్ పొలిటిషియన్. బీహార్ పాలిటిక్స్‎లో ఛోటే సర్కార్‎గా గుర్తింపు పొందిన ఆయన జనతా దళ్ యునైటెడ్ తరపున మొకామా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న అనంత్ సింగ్‎పై హత్య, దాడి, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో సహా అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి.

 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడైన దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. జైలులో ఉంటూనే ఎన్నికల్లో పోటీ చేసి ఆర్‌జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2026, ఫిబ్రవరిలో పాట్నా కోర్టు అనుమతితో జైలు నుంచి అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో పాట్నా హైకోర్టు ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 

ఈ క్రమంలోనే ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధినేత, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కోసం 9 మందిని చంపానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇటీవల జరిగిన బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థికి ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అనంత్ సింగ్‎పై జేడీయూ బహిష్కరణ వేటు వేసింది.