సోమాజిగూడలో తుపాకీ కలకలం..  బార్‎ సిబ్బంది, కస్టమర్లను బెదిరించిన యువకుడు

సోమాజిగూడలో తుపాకీ కలకలం..  బార్‎ సిబ్బంది, కస్టమర్లను బెదిరించిన యువకుడు

హైదరాబాద్: సోమాజిగూడలోని ఓ బార్‎లో తుపాకీ కలకలం రేపింది. బార్‎లో ఓ యువకుడు కస్టమర్లు, బౌన్సర్లపై తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. మహమ్మద్ షానవాజ్ (24) అనే యువకుడు శుక్రవారం రాత్రి సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ బార్ & రెస్టారెంట్‌‎కు వెళ్లాడు. 

బిల్లు డబ్బుల విషయంలో బార్ యాజమాన్యంతో వాగ్వాదం జరిగింది. బిల్లు డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే కాల్చేస్తా అంటూ తన కారులోని తుపాకీతో బార్‎ సిబ్బంది, కస్టమర్లను బెదిరించాడు. దీంతో బార్ సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు యువకుడిని అడ్డుకున్నారు. 

బార్ యాజమాన్యం ఫిర్యాదుతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి దగ్గరి నుంచి తుపాకీతో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు. యువకుడికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.