గిరిజన కుటుంబాలకు గుడ్‌న్యూస్..125 రోజుల ఉపాధి.. కొత్త జాబ్ కార్డులు

గిరిజన కుటుంబాలకు  గుడ్‌న్యూస్..125 రోజుల ఉపాధి.. కొత్త జాబ్ కార్డులు

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కరువు పరిస్థితుల్లో గిరిజన కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది.

జాబ్ కార్డులు లేని కుటుంబాలకు కొత్త కార్డులు

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే జాబ్ కార్డులు లేని అర్హులైన ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని సూచించారు.అలాగే, VB-G RAM G పథకం కింద అర్హులైన గిరిజన కుటుంబాలకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుటుంబంలో 18 ఏళ్లు నిండిన సభ్యులందరి పేర్లను జాబ్ కార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడకుండా గ్రామాల్లోనే పనులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు అందేలా చూడటంతో పాటు, ఉపాధి అవకాశాలను సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

అన్ని జిల్లాల్లో అర్హులైన గిరిజన కుటుంబాలను గుర్తించి జాబ్ కార్డులు జారీ చేయాలని, వారికి 125 రోజుల ఉపాధి కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు.

 ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో కరువు ప్రభావిత పరిస్థితుల్లో గిరిజన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వలసలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.  ఉత్తర్వుల అమలు, అర్హుల గుర్తింపు, జాబ్ కార్డుల జారీ ప్రక్రియపై సంబంధిత అధికారులు దృష్టి సారించనున్నారు.