కమీషన్ల కోసమే నాసిరకం ప్రాజెక్టులు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ విమర్శలు

కమీషన్ల కోసమే నాసిరకం ప్రాజెక్టులు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ విమర్శలు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తుగ్లక్‌లా పాలన సాగించారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వినియోగం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావని వ్యాఖ్యానించారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని మంత్రి వివేక్ ఆరోపించారు. కమీషన్ల కోసమే నాసిరకం నాణ్యతతో ప్రాజెక్టులను నిర్మించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు ఎక్కడైనా కూలిపోయాయా? అని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు దెబ్బతిందని నిలదీశారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా తప్పుడు ప్రచారంతో మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు గుప్పించారు.

రాష్ట్రంలో నీటి వినియోగం, సాగునీటి నిర్వహణపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 700 టీఎంసీల నీరు వృథాగా పోయిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నీటి వినియోగం మెరుగుపడి, ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు తగ్గేవని అభిప్రాయపడ్డారు.నీటి విషయంలో బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై చర్చ జరగాలని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ పనితీరుపై మంత్రి వివేక్ ప్రశ్నలు లేవనెత్తారు. కన్నెపల్లి పంప్‌హౌస్ సమర్థంగా పనిచేస్తే బ్యారేజీల నిర్మాణం ఎందుకు అవసరమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రూపకల్పనపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని, వాటి ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోందని విమర్శించారు.

 ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. లోయర్ మానేరు డ్యామ్‌కు 24 టీఎంసీల నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు.రాష్ట్రంలో నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్వహణపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.