హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లలకు పీరియడ్స్ కష్టాలు

హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లలకు పీరియడ్స్ కష్టాలు
  • శానిటరీ ప్యాడ్స్ మార్చుకునేందుకు ప్రైవసీ కరువు 
  • ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మురికివాడల్లో కన్నీటి వ్యథలు 
  • ఇరుకు గదుల ఇండ్లలో అవస్థలు
  • తలుపులు, లైట్లు లేని కమ్యూనిటీ టాయిలెట్లు
  • ఆకతాయిల భయంతో బిక్కుబిక్కుమంటున్న బాలికలు
  • టొరంటో, హైదరాబాద్​ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:  హైదరాబాద్ మహానగరంలో సంపన్న ప్రాంతాల పక్కనే ఉన్న మురికివాడల్లో టీనేజీ బాలికలు అనుభవిస్తున్న పీరియడ్స్ సమస్యలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవడానికి కనీస ప్రైవసీ లేక.. తాగునీరు, పారిశుధ్య వసతులు కానరాక బస్తీల్లోని ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

ఈ విషయాలు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని ఫిల్మ్ నగర్ బస్తీల్లో నిర్వహించిన అధ్యయనంలో తేలాయి. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో డల్లా లానా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకురాలు స్నిగ్ధ వెలుగు నేతృత్వంలో ప్రొఫెసర్ ఎరికా డి రుగ్గీరో, ప్రొఫెసర్ నందా కిశోర్ కన్నూరి (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీయూ), అనుష్క అతావుల్లాజాన్ ఈ రీసెర్చ్ చేశారు.

కేవలం శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేస్తే సమస్య పరిష్కారం కాదని, ఇరుకైన ఇండ్లు, టాయిలెట్స్ లేకపోవడం, తీవ్ర నీటి ఎద్దడి, సామాజిక ఆంక్షలు వారిని తీవ్ర అభద్రతలోకి నెడుతున్నాయని గుర్తించారు. మురికివాడల్లోని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, పారిశుధ్యం, నీటి వసతి కల్పించినప్పుడే ఆడపిల్లల ఆత్మగౌరవానికి నిజమైన రక్షణ లభిస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో 80 శాతం జనాభా మురికివాడల్లోనే జీవిస్తున్నట్టు పాత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫిల్మ్‌‌‌‌నగర్- షేక్‌‌‌‌పేట్ పరిధిలోని ఎంజీనగర్, పటేల్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లాంటి మురికివాడల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇక్కడ ఒక్కో కుటుంబం సుమారు 10x10 అడుగుల విస్తీర్ణం ఉండే ఒకే ఒక్క గదిలో నివసిస్తోంది. ఆ ఒక్క గదే రాత్రి వేళ పడకగదిగా, పగటిపూట వంటగదిగా మారుతోంది.

ఇళ్ల మధ్య సందులు కేవలం ఐదారు అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో నెలసరి సమయంలో బాలికలకు కనీస ఏకాంతం దొరకడం లేదు. వాడిన శానిటరీ ప్యాడ్లను పారవేయడానికి ప్రత్యేక డస్ట్‌‌‌‌ బిన్లు లేవు. దీంతో బహిరంగ చెత్త కుప్పల్లోనే వాటిని పడేయాల్సి వస్తోంది. కుక్కలు, ఇతర జంతువులు ఆ వ్యర్థాలను పీక్కుతింటూ రోడ్లపైకి లాగుతుండటంతో అటు పారిశుధ్య సమస్యలతోపాటు..వాటిని చూసి బాలికలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. స్థానిక పారిశుధ్య కార్మికులు కూడా ఈ చెత్తను సక్రమంగా తొలగించడం లేదు.

రాత్రి 10 దాటితే ఆరుబయటే.. 

బస్తీల్లోని కమ్యూనిటీ టాయిలెట్స్ కిలోమీటరున్నర దూరంలో ఉండటమే కాకుండా, వాటికి రుసుము వసూలు చేస్తున్నారు. పైగా ఇవి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే తెరిచి ఉంటాయి. రాత్రి 10 దాటితే మహిళలు, ఆడపిల్లలు బహిరంగ మలవిసర్జనకే వెళ్లాల్సి వస్తోంది. అపరిశుభ్ర వాతావరణం, తాగుబోతుల బెడదకు తోడు చాలా టాయిలెట్లకు తలుపులు సరిగ్గా ఉండవు. ఉన్నా లోపల గడియలు విరిగిపోయి ఉంటాయి.

వెలుతురు కోసం బల్బులు కూడా ఉండవు. నెలసరి సమయంలో రక్తస్రావంతో బాధపడుతూనే, లైంగిక వేధింపుల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఆ సమయంలో భద్రత కోసం కుటుంబ సభ్యులు కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. మరోవైపు బాలిక రజస్వల కాగానే శారీరక పరిపక్వత వచ్చిందనే నెపంతో బస్తీలోని పోకిరీల నుంచి అనుచిత చూపులు, లైంగిక వేధింపుల ముప్పు పెరిగిపోతోందని అధ్యయనం పేర్కొన్నది. 

వచ్చే ఏడాదే ఫైనల్ రిపోర్ట్‌‌‌‌..

ఈ రీసెర్స్‌‌‌‌కు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎథిక్స్ బోర్డుల నుంచి ముందస్తు అనుమతులు లభించాయి. కెనడా ప్రభుత్వానికి చెందిన ఎస్ఎస్‌‌‌‌హెచ్ఆర్సీ, ఐడీఆర్సీ సంస్థలు నిధులు సమకూర్చాయి. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు క్షేత్రస్థాయి డేటా సేకరణ పూర్తి కాగా, ప్రస్తుతం ఫ్రేమ్ అనాలిసిస్ పద్ధతిలో విశ్లేషణ కొనసాగుతోంది. 2027 సెప్టెంబర్ నాటికి ఈ  రీసెర్చ్ సమగ్ర ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

మురికివాడల్లోని క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా పాలకులు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని.. పారిశుధ్యం, నిరంతర నీటి సరఫరా, ఏకాంతం కల్పించినప్పుడే ఆడపిల్లల ఆత్మగౌరవానికి నిజమైన రక్షణ లభిస్తుందని ఈ అధ్యయన తేల్చి  చెప్పింది.

బస్తీల్లో రీసెర్చ్ సాగిందిలా..

గతంలో టీచ్ ఫర్ ఇండియా ఫెలోగా ఇదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన స్నిగ్ధ వెలుగు..తన పీహెచ్‌‌‌‌డీ పరిశోధన కోసం తిరిగి ఈ క్షేత్రాన్నే ఎంచుకున్నారు. ఫిల్మ్‌‌‌‌నగర్‌‌‌‌లోని 18 మురికివాడల్లో తొలుత ఐదు బస్తీలను అనుకున్నప్పటికీ, సమయాభావం వల్ల అత్యంత సాంద్రత కలిగిన ఎంజీ నగర్, పటేల్ నగర్ బస్తీలకే అధ్యయనాన్ని పరిమితం చేశారు. స్థానిక ఇష్వా ఫౌండేషన్ సహకారంతో మొత్తం 18 కుటుంబాలను భాగస్వామ్యులను చేశారు.

ఇందులో 9 నుంచి 17 ఏండ్ల లోపున్న 11 మంది  బాలికలు, 18 మంది తల్లులు, నలుగురు తండ్రులు, 15-–24 ఏండ్ల లోపున్న ఒక పెండ్లికాని సోదరుడు ఉన్నారు. తండ్రులు  ఎక్కువగా దినసరి కూలీలు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుండగా, తల్లులు ఇళ్లల్లో పనులు, ఆసుపత్రులు, మాల్స్‌‌‌‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా హిందూ, క్రిస్టియన్‌‌‌‌ వర్గాలవారు ఇందులో పాల్గొనగా, తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ముస్లిం మహిళలు ఇందులో భాగస్వామ్యం కాలేకపోయారు.