చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఙానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ఉద్యమంలో పలుశక్తులు ఉన్నాయి. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌కు ప్రధాన వ్యతిరేక శక్తి ఇండియా కూటమి. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉద్యమం ద్వారా మారుస్తామని ఎక్కడా చెప్పలేదు. రెండో ప్రధాన ఉద్యమ శక్తి కాక్రోచ్ జనతా పార్టీ. దాని నాయకులెవ్వరూ ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని మారుస్తామని చెప్పలేదు.
మొట్టమొదట సీపీఐ (ఎంఎల్)కు అనుబంధంగా పనిచేసే విద్యార్థి సంస్థ నాయకురాలు నేహాబోరా బంగ్లాదేశ్‌లో జరిగిన రెజీమ్ చేంజి ఉద్యమం గురించి మాట్లాడింది. ఆ తరువాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రశాంత్ భూషణ్ రెజీమ్ చేంజి కోసం పోరాటం గురించి మాట్లాడాడు. వీటిని ఆసరాగా తీసుకుని బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ రెజీమ్ చేంజి కుట్ర జరుగుతోందని అన్ని సందర్భాలలో కాంగ్రెస్‌ను, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలను ఎటాక్ చేస్తున్నాయి. ఇది అసలు సమస్యను పక్కదారి పట్టించడం కోసమే.
రెజీమ్ చేంజ్ అనేది విప్లవాల ద్వారా లేదా మిలిటరీ ద్వారా జరిగినప్పుడు ఉపయోగించే పదం. బంగ్లాదేశ్‌లో అలా జరిగింది. తరువాత ఒక తాత్కాలిక అధ్యక్షుని నాయకత్వంలో కొంతకాలం ప్రభుత్వం నడిచింది. మిలిటరీ డిక్టేటర్‌షిప్ రాలేదు. తరువాత ఎన్నికలు జరిగాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుందని బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌కు భయమెందుకు? ఇది బలమైన రాజ్యాంగం ద్వారా నిలదొక్కుకున్న డెమొక్రసీ. ఈ సీఈసీ వ్యతిరేక ఉద్యమంలో రాజ్యాంగం ప్రధాన ఆయుధం. పోరాటం ఓటుహక్కు రక్షణ కోసం. అక్రమంగా 13.5 కోట్ల ఓట్లు తొలగించింది రెజీమ్‌ను నియంతృత్వంలోకి నెట్టడానికి.
సీఈసీ పనితీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేదా, నాశనం చేసేదా?
తిరిగి ఓటు వేయగలిగే ప్రతిపౌరునికి ఓటుహక్కు ఇప్పించి, ఆ ఓటు ద్వారా వేరే పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పేముంది? ఇక్కడ ఓటుద్వారా ప్రభుత్వం మారాలనే కదా రాజ్యాంగం చెప్పేది. వీధుల్లో ఉద్యమాల ద్వారా రెజీమ్ మారుస్తామని ఎవరన్నా అది పిచ్చివాదన కదా! అటువంటప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లు అంతగా ఎందుకు భయపడుతున్నాయి.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ఎందుకు సపోర్టు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ. దానిమీద వచ్చిన ఆరోపణలకు అది మాత్రమే సమాధానం చెప్పుకోవాలి. సీఈసీ పనితీరు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదా, నాశనం చేసేదా అనే అంశాన్ని ప్రజలు కచ్చితంగా జడ్జి చేస్తారు. ఆ కమిషన్ ప్రభుత్వానికి ఎంత జవాబుదారి సంస్థనో, ప్రతిపక్షాల పార్టీలకు అంతే జవాబుదారీ సంస్థ. ప్రజలకూ అంతే జవాబుదారీ సంస్థ. దానిమీద వచ్చే విమర్శలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎందుకు సమాధానం చెబుతున్నాయి. ఇక్కడే సమస్య అంతా.
క్రైసిస్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ
సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే చాలా స్పష్టంగా మా సంస్థ పని జవాబుదారీ విధానాన్ని అమలు చేయించడం. మేం ప్రభుత్వాలను మార్చం అని చెబుతూనే ఉన్నాడు. రెజీమ్ చేంజ్ అనేది మా నినాదం కాదు అని కూడా చెబుతున్నాడు. అయినా జంతర్ మంతర్‌ను అకస్మాత్తుగా డీనోటిఫై చేసి అక్కడ ప్రొటెస్టు చేసినందుకు వారిని జైలులో బంధించడం ఎంత అన్యాయం! సీఈసీ చేసిన పనివల్ల మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ క్రైసిస్‌లో పడింది.
ఎన్నికల వ్యవస్థ రాజ్య వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. ఇది కదా సమస్య! ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్ రితికా చోప్రా ఈ దేశాన్ని గొప్ప ప్రమాదం నుంచి కాపాడింది. ఈ ప్రభుత్వం దేశమంతటా ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నాయకులను విభిన్న కేసులతో వేధిస్తున్న సమయమిది. ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను చితకకొడుతున్న రోజులివి. ఈ స్థితిలో సీజేపీ పుట్టుకురావడం, వారి ఏజిటేషన్‌తో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కొంత భయాన్ని తొలగించిన సమయమది. కానీ రితికా చోప్రా చాలాకాలం నుంచి ఒక ప్రమాదకర ఇన్వెస్టిగేషన్ ద్వారా సీఈసీ బండారాన్ని బయటపెట్టింది. తరువాత దేశమంతా అట్టుడికిపోయేంత ఏజిటేషన్లు జరిగాయి. అయినా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇసుమంత చింతిస్తున్నట్టు కనిపించలేదు. ఈ ధోరణి ఏ పార్టీలో ఉన్నా మంచిది కాదు.
ఆర్ఎస్‌ఎస్ జాతీయ మొరాలిటీ సమస్య
బీజేపీ పార్టీ గతంలో నేను చెప్పినట్టు రెండు సభ్యత్వాలున్న పార్టీ. అది కేవలం పార్టీ మెంబర్‌షిప్‌తోకాక ఆర్‌ఎస్‌ఎస్ మెంబర్‌షిప్ కూడా ప్రధాన నాయకులను తీసుకోమంటుంది. దేశాన్ని పాలించే పార్టీ నాయకులు అధికారం కోసం ఏ ఎత్తుగడ వేసినా ఒక మోరల్ సంస్థ అని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్ ఈ సీఈసీ విధానాన్ని ఆర్‌ఎస్‌ఎస్ వెనకుండి నడిపించిందా, లేదా ప్రభుత్వాన్ని అధికారంలో ఉండడానికి ఏదైనా చేసుకోనివ్వమని చూడనట్టు ఊరుకుందా! అస్సాంలో ముస్లింలను అదుపులో పెట్టాలని మొదలుపెట్టిన సర్ క్రమంగా దేశమంతటా జరిపి ఎస్సీ, ఎస్టీల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని వార్తలొస్తున్నాయి.
దేశంలోని ఎస్సీ, ఎస్టీలు ఎక్కడి నుంచి మైగ్రేట్ అయివచ్చారు? ఈ దేశంలో కూలీనాలీ చేసుకుని బతికే ఎస్సీ, ఎస్టీలు కూడా విదేశస్తులయ్యారా! రెండోది.. కొంతమంది రెండుచోట్ల ఓట్లు వేస్తున్నారని తొలగించారని వాదిస్తున్నారు. దాని ఆపడానికి వేలుపై పెట్టే సిరా గుర్తు ఉంది కదా! ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు వేసేటప్పుడు హైదరాబాద్ నుంచి వేలసంఖ్యలో పోయి ఓటు వేశారని 2024 ఎన్నికల్లో అందరికీ తెలుసు. అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు తొలగించిన దాఖలాలు లేవు.
ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఆర్‌ఎస్‌ఎస్ అభిప్రాయమేంటి?
హైదరాబాద్‌లో బతికేవారు ఇక్కడే ఓటు వేయాలికాని ఆంధ్రకు పోయి ఓటువేస్తే ఆంధ్రాలో వారి ఓటును తొలగించాలికాని హైదరాబాద్‌లో ఉండేవారివి లక్షలాది ఓట్లు తొలగించారని వార్తలొస్తున్నాయి. ఇదెట్ల సాధ్యం. ముషీరాబాద్ నియోజకవర్గంలో వేలసంఖ్యలో తొలిగించినట్టు ఇండిపెండెంట్ జ్యూరీ చెబుతున్నది. ఇదెందుకు చేశారు? ఈ స్థితికి ఆర్‌ఎస్‌ఎస్ ఏం చెబుతుంది? క్రమంగా బీదవారి ఓట్లు తొలగించి అడల్ట్ ఫ్రాంచైజ్‌ను రద్దు చేయాలని వీరి ఆలోచనలో ఉందని కూడా చర్చ జరుగుతుంది.
దీనికి వీరి సమాధానమేమిటి? మొత్తం ఈ ఓటు తొలగింపు వ్యవహారంలో ఆర్ఎస్‌ఎస్ తన అభిప్రాయమేంటో ప్రజలకు చెప్పాలి కదా! ప్రభుత్వాలను వెనుకనుంచి నడిపే ఆర్‌ఎస్‌ఎస్ ఇంత పెద్ద సమస్య దేశం ముందుకొచ్చినప్పుడు, హిందువులనుకునేవారి ఓట్లనే కోట్లకొద్దీ తొలగించినప్పుడు, ఈ పద్ధతిని తాము అంగీకరించడం లేదంటేనే కదా ఆర్‌ఎస్‌ఎస్‌కి దేశభక్తి ఉన్నట్లు. దేశంలోని శ్రమజీవుల ఓట్లను తొలగించి.. అది ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా ఇది ప్రజాస్వామ్య రక్షణ కోసమే అంటే ఎలా!
ఓటుహక్కు ఒక నైతిక సమస్య
మత విలువలుకాని, సెక్యులర్ విలువలుకాని ఆధునిక సమాజంలో వ్యక్తి ఓటుహక్కును గౌరవించకపోతే ఆ విలువలు నియంతృత్వం వైపు పయనిస్తున్నాయని కచ్చితంగా అర్థమౌతుంది. 80 సంవత్సరాలు వ్యక్తిహక్కుగా ఓటుహక్కును అనుభవించిన శ్రమజీవులు సైతం ఓటుహక్కును రద్దుచేసే విలువలను ప్రజాస్వామ్య వ్యతిరేక విలువలుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడున్న డబ్బు ఎన్నికల దశలో ఓటుహక్కున్న బీదవారి ఓట్లను అడగవచ్చేవారు కొంత డబ్బు కూడా ఇచ్చిపోతున్న రోజులివి.
ఒక బీద వ్యక్తికి ఓటు లేకుండా చేసినప్పుడు, ఓటురోజు ఇంటికొచ్చే పైసలను కూడా రాకుండా చేసినప్పుడు అట్ల చేసిన పార్టీపైన కోపం రాకుండా ఎట్ల ఉంటుంది? తాగుబోతు పురుషులకు ఓట్లప్పుడు పార్టీకొక్కటిగా ఇంటికొచ్చే సీసా కూడా పోతుంది. అప్పుడు ఆ తాగుబోతుకు ఈ విధంగా తాగుడు సీసాలను అడ్డుకున్న పార్టీ, లేదా సంస్థ మీద ఎంతకోపం వస్తుంది? ఈ రోజుల్లో సీసా, పైసా పంచుడుకు అతీతంగా ఏపార్టీ ఓట్లు సంపాదిస్తుంది?
ఒక తాగుబోతు ఓటు రద్దుచేసి అతనితో తిట్లు తింటే కూడా పాపమే కదా! భారతదేశంలో ఓటుహక్కు అతి బీదవారికి, చదువురానివారికి, బిచ్చగాళ్లకు ఇప్పించి అంబేద్కర్ ఒక విప్లవం తెచ్చాడు. కనుక ఆ ఓటుహక్కును తమకు అనువైన సీఈసీ ద్వారా తొలగింపజేస్తే ప్రమాదం మామూలుగా ఉండదు. అందుకే ఈ చర్చ దినదినం ఇంటింటికీ పోతోంది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచన 700 పదాలకు మించరాదు.
