హైదరాబాద్ సిటీ: ట్యాంకర్ల నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్

హైదరాబాద్ సిటీ: ట్యాంకర్ల నీరు వృథా చేస్తే  రూ.5 వేలు ఫైన్
  •  రెండోసారి తప్పు జరిగితే రిజిస్ట్రేషన్‌‌ రద్దు
  •      నవంబర్‌‌ 1 నుంచి అమలు
  •      తాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైన జలమండలి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే సమయంలో.. నిర్లక్ష్యంగా వ్యవహరించి, నీరు రోడ్లపై పడేలా చేస్తే నవంబర్‌‌ 1 నుంచి ట్యాంకర్ల యజమానులకు రూ.5 వేల జరిమానా విధించనుంది. రెండోసారి అదే తప్పు చేస్తే సంబంధిత ట్యాంకర్‌‌ రిజిస్ట్రేషన్‌‌ను రద్దు చేయనుంది. ఈ మేరకు జలమండలి ఎండీ కె.అశోక్‌‌రెడ్డి శనివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ట్యాంకర్లలో సామర్థ్యానికి మించి నీటిని నింపడం, మూతలు లేకపోవడం, ఉన్నా సరిగా మూయకపోవడం వల్ల రవాణా సమయంలో నీరు రోడ్లపైకి చేరుతోందని జలమండలి గుర్తించింది. దీనివల్ల తాగునీరు వృథా కావడంతో పాటు వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో నీటి లీకేజీలు ఉన్న ట్యాంకర్లతోపాటు మూతలు లేని, సరిగా మూసివేయని ట్యాంకర్లలో నీటిని నింపేందుకు అనుమతించకూడదని స్పష్టం చేసింది.

ఫిల్లింగ్‌‌ స్టేషన్ల వద్ద తనిఖీలు

జలమండలి పరిధిలోని అన్ని ఫిల్లింగ్‌‌ స్టేషన్ల మేనేజర్లు, ఇన్‌‌చార్జులు ట్యాంకర్ల పరిస్థితిని పరిశీలించిన తర్వాతే నీటిని నింపాలని ఎండీ ఆదేశించారు. లీకేజీలు, ఇతర లోపాలు గుర్తిస్తే వాటిని సరిచేసే వరకూ ఆయా ట్యాంకర్లలో నీరు పోయకుండా నిలిపివేయాలని సూచించారు. నిబంధనల అమలును ఆపరేషన్స్‌‌ అండ్‌‌ మెయింటెనెన్స్‌‌ విభాగాల జనరల్‌‌ మేనేజర్లు పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతీ నీటి బొట్టును కాపాడాలి

నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ నీటి బొట్టును సంరక్షించుకోవడం అందరి బాధ్యతని ఎండీ అశోక్‌‌రెడ్డి పేర్కొన్నారు. ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు నీటి వృథాను అరికట్టేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్యాంకర్‌‌ అసోసియేషన్లు తమ సభ్యులకు నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. తాగునీటి వృథాను అరికట్టేందుకు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.