న్యూఢిల్లీ: అదానీ విండ్ 696.2 మెగావాట్ల విండ్ టర్బైన్ ఆర్డర్లను దక్కించుకుంది. ఐదు వేర్వేరు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి ఈ ఆర్డర్లు వచ్చాయి. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌కు చెందిన పూర్వ గ్రీన్ పవర్ నుంచి 300 మెగావాట్లు, బీసీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన జిందాల్ ఇండియా పవర్ నుంచి 155 మెగావాట్లు, ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 109.2 మెగావాట్లు, ఆదిత్య బిర్లా రెన్యూవబుల్స్ నుంచి 82.5 మెగావాట్లు, ఇంటిగ్రమ్ ఎనర్జీ నుంచి 49.5 మెగావాట్ల ఆర్డర్లు దక్కాయి. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల్లోని ఈ ప్రాజెక్టులకు 5.2 మెగావాట్లు, 5 మెగావాట్లు, 3.3 మెగావాట్ల సామర్థ్యం ఉన్న టర్బైన్లను సరఫరా చేయనున్నారు. ఈ తాజా ఒప్పందాలతో గ్రూప్ వెలుపలి సంస్థల నుంచి అదానీ విండ్ సాధించిన మొత్తం ఆర్డర్ల సామర్థ్యం ఒక గిగావాట్ దాటింది.
