న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. మెమరీ చిప్‌ల ధరలు రికార్డు స్థాయికి చేరడం, విడిభాగాల ఖర్చులు పెరగడంతో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు ఏడాది లెక్కన 20 శాతం పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్‌పాయింట్ రిపోర్ట్ ప్రకారం, ఈసారి పండుగ టైమ్‌లోనూ వినియోగదారుల నుంచి డిమాండ్ కనిపించడం లేదు. దీంతో తయారీ సంస్థలు మార్కెట్‌లోకి కొత్త స్టాక్‌ను పంపేందుకు వెనుకాడుతున్నాయి.
ముఖ్యంగా సాధారణ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే బడ్జెట్ విభాగం తీవ్రంగా ప్రభావితమైంది. మోడళ్ల ధరలు పెరగడంతో రూ.20 వేల లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు సెప్టెంబర్ క్వార్టర్‌లో ఏకంగా 47 శాతం పడిపోయాయి. రూ.15 వేల లోపు విభాగం బలహీనపడటంతో అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. మొత్తం 2026 క్యాలెండర్ సంవత్సరంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దాదాపు 13 శాతం క్షీణించే అవకాశం ఉందని అంచనా.
మళ్లీ వస్తున్న 4జీ మోడల్స్
ధరలను అదుపులో ఉంచేందుకు కంపెనీలు తక్కువ స్పెసిఫికేషన్లు, 4జీ మోడళ్లను తిరిగి ప్రవేశపెడుతున్నాయి. 2027లోనూ ఈ ప్రతికూల పరిస్థితులు కొనసాగొచ్చని, ప్రీమియం విభాగంలో ఎక్కువ వృద్ధి ఉంటుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లే అమ్మకాలకు కీలకంగా మారనున్నాయని తెలిపింది.
