హైదరాబాద్: స్టైపెండ్ కోసం 17వ రోజు ఎఫ్‌ఎంజీల నిరసన

హైదరాబాద్: స్టైపెండ్ కోసం  17వ రోజు ఎఫ్‌ఎంజీల  నిరసన

హైదరాబాద్, వెలుగు: తమకు న్యాయబద్ధంగా రావాల్సిన స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్‌ఎంజీ) ఇంటర్న్స్​ చేపట్టిన శాంతియుత నిరసన శనివారం నాటికి 17వ రోజుకు చేరింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌ కు పెద్ద ఎత్తున చేరుకున్న ఇంటర్న్లు.. ఐఎండీ సమానంగా తమకూ స్టైపెండ్ ఇవ్వాలని నినదించారు. అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లపై ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టకూడదని, రూల్స్ కు విరుద్ధంగా ఇంటర్న్‌షిప్ కాలాన్ని ఇష్టారాజ్యంగా పొడిగించడాన్ని ఆపాలని డిమాండ్  చేశారు. 

మరోవైపు ఎఫ్‌ఎంజీ ఇంటర్న్ల ప్రతినిధి టీమ్ సంగారెడ్డిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి తమ సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. హెల్త్ సెక్రెటేరియట్‌ తో ఉన్నతస్థాయిలో చర్చించి, సోమవారం నాడు  తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం  చేసినట్లు ఎఫ్ఎంజీలు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక లిఖితపూర్వక ఉత్తర్వు వచ్చేంత వరకు తమ శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఇంటర్న్లు తేల్చిచెప్పారు.