హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (ఎనలిస్ట్ గ్రేడ్–2) పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 68 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 19,568 మంది అభ్యర్థులకు గాను పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 9,867 మంది (50.42 శాతం) హాజరయ్యారు.
మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పేపర్–2 పరీక్షకు 9,761 మంది (49.88 శాతం) అభ్యర్థులు హాజరైనట్లు కమిషన్ సెక్రెటరీ హరిత వెల్లడించారు. పరీక్ష నిర్వహణను టీజీపీఎస్సీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్ ద్వారా ఆఫీసర్లు పర్యవేక్షించారు. ఈ పరీక్షలకు 77 మంది అబ్జర్వర్లు, 35 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 77 మంది సిట్టింగ్ స్క్వాడ్ అధికారులతో పాటు 50 మంది టీజీపీఎస్సీ అధికారులను రంగంలోకి దించినట్లు సెక్రటరీ తెలిపారు.
