హైదరాబాద్, వెలుగు: సర్ పేరుతో బీజేపీ ఈ దేశంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని పారదోలుదాం’’ అనే నినాదంతో పాదయాత్ర చేస్తానని ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు శనివారం సీఎల్పీలో జరిగిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాంచందర్ రావు ఇస్తున్న ఈ నినాదం చూస్తే జాలిపడాలో లేక నవ్వాలో అర్థం కావడం లేదని తెలిపారు.
ఆయన పాదయాత్ర చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామనే ముసుగులో పాదయాత్ర చేపట్టడంపైనే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ రాచరికం వైపు దేశాన్ని తీసుకెళ్తున్న ప్రధాని మోదీ తీరును దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అలాంటి పార్టీకి చెందిన నేత ప్రజాస్వామ్యం పేరుతో పాదయాత్ర చేయడం అంటే.. ‘‘చంపినోడే శవాన్ని మోసి సంతాపం తెలిపినట్లుగా ఉంది”అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
