ఢిల్లీ జామియా క్యాంపస్‌‌‌‌లో హైటెన్షన్‌‌‌‌.. సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య తోపులాట

ఢిల్లీ జామియా క్యాంపస్‌‌‌‌లో హైటెన్షన్‌‌‌‌.. సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య తోపులాట

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రముఖ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ తలెత్తడంతో క్యాంపస్‌‌‌‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. క్లాసులను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ విధానంలోకి మారుస్తున్నట్లు ప్రకటించింది. 

2006లో క్యాంపస్‌‌‌‌లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా ‘జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్' (జేఎంఐఎస్ యూ)ను రద్దు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు లేకపోవడంతో, స్టూడెంట్ యూనియన్‌‌‌‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 12 నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్లను ఖాళీ చేయించేందుకు, వారు వేసుకున్న టెంట్లను తొలగించేందుకు సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. 

కాంగ్రెస్ నేతల రాకతోనే: రిజిస్ట్రార్

కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌‌‌‌గఢీ, ఇమ్రాన్ మసూద్ కాంపౌండ్ గోడ దూకి విద్యార్థుల వద్దకు వచ్చి వారిని రెచ్చగొట్టారని జామియా రిజిస్ట్రార్ మహ్తాబ్ ఆలం రిజ్వి ఆరోపించారు. వారి రాకతోనే క్యాంపస్‌‌‌‌లో ప్రశాంత వాతావరణం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిజ్వీ తెలిపారు. 

మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకపోయినా, యూనివర్సిటీ యాజమాన్యం వారిపై అనవసరంగా దాడి చేసిందని వామపక్ష విద్యార్థి సంఘం ఐసా (ఐసా) ఆరోపించింది. విద్యార్థుల పట్ల సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. అయితే, స్టూడెంట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ యాజమాన్యం ఖండించింది.

వర్సిటీ గోడలపై వివాదాస్పద నినాదాలు

క్యాంపస్​గోడలపై దేశ వ్యతిరేక (జమ్మూ కాశ్మీర్‌‌‌‌కు సంబంధించిన) నినాదాలు కనిపించడం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, ఈ స్లోగన్లతో తమ నిరసనకు సంబంధంలేదని, తమ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు వర్సిటీ యాజమాన్యమే ఇదంతా నాటకమాడుతోందని విద్యార్థి నేతలు ఆరోపించారు. తమ ఏకైక డిమాండ్ ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థి యూనియన్ ఎన్నికలు నిర్వహించడమేనని తేల్చిచెప్పారు.