ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వ మార్పు జరగాలి.. అదే దేశ ప్రజలు కోరుకుంటున్నారు: కపిల్ సిబల్

ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వ మార్పు జరగాలి.. అదే దేశ ప్రజలు కోరుకుంటున్నారు: కపిల్ సిబల్

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వ మార్పు జరగాలని ప్రజలు కోరుకుంటునట్లు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద యువకులు ఎలాంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. నిరసన ప్రాంతానికి రాళ్లతో కూడిన ట్రక్కు రావడం వెనుక కుట్ర ఉందని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో భారత్‌‌‌‌లో కూడా రెజిమ్ చేంజ్(పాలనా మార్పు) తీసుకురావడానికి కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఇటీవల ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భారత్‌‌‌‌లో ప్రభుత్వ మార్పు డిమాండ్లను ఆయన నేపాల్, బంగ్లాదేశ్, అల్బేనియా, ఫ్రాన్స్ పరిణామాలతో  పోల్చడం ఆశ్చర్యం కలిగించిందని సిబల్ అన్నారు.

ఆయా దేశాల్లో ప్రభుత్వాలను మార్చడానికి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున బహిరంగ తిరుగుబాట్లు చేశారని.. అలాంటి పోరాటాలు హింసకు, ప్రాణనష్టానికి దారితీస్తాయని తెలిపారు. కానీ, భారత్‌‌‌‌లో పరిస్థితి అలా కాదని కపిల్ సిబల్ వెల్లడించారు. 

భారత ప్రజలు ఎలాంటి హింసాత్మక విప్లవాలు కోరుకోవడం లేదని.. కేవలం ఓటింగ్, ఎన్నికలు, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారానే ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారని వివరించారు. ఈ విషయం భగవత్‌‌‌‌కు స్పష్టంగా తెలిసినా.. ఆయన బహిరంగంగా అంగీకరించలేకపోతున్నారని కపిల్ సిబల్ ఆరోపించారు.

అసలు సమస్యలపై ఎందుకు మాట్లాడరు..?

గతంలో కేజ్రీవాల్‌‌‌‌కు మద్దతు ఇచ్చి యూపీఏ ప్రభుత్వ పతనానికి ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ కారణమైందని సిబల్ ఆరోపించారు. మోదీ పాలనలో దేశం నష్టపోయిందని, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ మాత్రం లబ్ది పొందిందని విమర్శించారు. భగవత్ తన ప్రసంగంలో విదేశీ శక్తుల జోక్యం గురించి మాట్లాడుతున్నారు కానీ, దేశంలోని నిరుద్యోగం, విద్యావకాశాలు లేకపోవడం వంటి సమస్యల గురించి మాట్లాడట్లేదని విమర్శించారు. ఓటర్ల జాబితాల ట్యాంపరింగ్, లడఖ్, అరుణాచల్​లో చొరబాట్లు, ప్రతిపక్ష నేతల నిర్బంధం వంటి సమస్యలపై భగవత్ మౌనం వహిస్తున్నారని సిబల్ ఆరోపించారు.