- రాష్ట్రవ్యాప్తంగా టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
- షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్ మందుల అమ్మకాల్లో రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు, అలవాటుగా మారే మందులను అక్రమంగా విక్రయిస్తున్న మెడికల్ షాపులపై టీజీ సేఫ్ -డ్రగ్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. క్యూర్ ప్రాంత పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్, జీడిమెట్ల, బాలానగర్, మేడిపల్లి, శామీర్పేట జోన్లతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డెకాయ్ ఆపరేషన్లు, టెస్ట్ కొనుగోళ్ల ద్వారా తనిఖీలు చేపట్టారు. రూల్స్ బ్రేక్ చేసిన 125 మెడికల్ షాపుల్లో అవకతవకలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు రద్దు చేయడానికి శాఖాపరమైన చర్యలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో రూల్స్ కు విరుద్ధంగా ట్రామడాల్, ఆల్ప్రాజోలమ్, నైట్రాజెపమ్, కొడీన్ దగ్గు సిరప్లు, టపెంటడాల్, ప్రీగాబాలిన్, జోల్పిడెమ్ వంటి షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్ కేటగిరీ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, ప్రిస్క్రిప్షన్ రికార్డులు, షెడ్యూల్ హెచ్1 రిజిస్టర్లు నిర్వహించకపోవడం, ఫార్మసిస్ట్ లేకుండానే మందులు ఇవ్వడం, బిల్లులు జారీ చేయకపోవడం, రికార్డులు చూపించకపోవడం వంటివి గుర్తించారు.
