గోదావరి పుష్కరాలకు రూ.2వేల కోట్లతో ఏర్పాట్లు : దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

గోదావరి పుష్కరాలకు రూ.2వేల కోట్లతో ఏర్పాట్లు : దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

నస్పూర్, వెలుగు: గోదావరి పుష్కరాలకు రూ.2 వేల కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేస్తున్నామని, పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, జిల్లా దేవాదాయ అధికారి రవితో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పుష్కర ఘాట్లు, ఇతర మౌలిక సదుపాయాలకు, ప్రధాన దేవాలయాల అభివృద్ధికి చెరో రూ.వెయ్యి కోట్ల చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. గోదావరి తీరంలోని 67 ఘాట్లకు సుమారు 5 నుంచి 6 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం పట్టణంలోని కాలేజ్ రోడ్డు గోదావరి తీరం, చెన్నూరు గోదావరి తీరంలో కొనసాగుతున్న పుష్కర ఘాట్ పనులను కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చెన్నూరులోని చెరువు వద్ద పర్యాటక ప్రాంత అభివృద్ధి అంశాన్ని పరిశీలించి, మదన పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.