మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) సురేఖ వేధింపులు భరించలేకపోతున్నామని జిల్లాలోని ఏవోలు, ఏఈవోలు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషనర్ జిల్లా కలెక్టర్ కుమార దీపక్‌ను ఆదేశించారు. దీంతో కలెక్టర్ డీఆర్డీవో కిషన్‌ను ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించారు. ఈ క్రమంలో కిషన్ శనివారం తన ఛాంబర్‌లో పలు మండలాల ఏవోలు, ఏఈవోలను పిలిచి విచారణ చేపట్టారు. డీఏవో సురేఖ తమను తీవ్రంగా వేధిస్తున్నారని వారు ఆరోపించినట్లు సమాచారం.
వేళాపాళా లేకుండా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ గంటల తరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు పేర్కొన్నట్లు తెలిసింది. ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత రాత్రి 7, 8 గంటలకు సమావేశాలు ఏర్పాటు చేయడంతో ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. డీఏవో వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించడంతో పాటు, ఆమెపై అవినీతి ఆరోపణలు కూడా చేసినట్లు తెలిసింది. పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడని కొందరు తమ ఫిర్యాదులను రాతపూర్వకంగా అందజేసినట్లు సమాచారం. మంచిర్యాల డివిజన్‌కు చెందిన ఏవోలు, ఏఈవోలను కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత కలెక్టర్‌కు రిపోర్ట్ అందజేసే అవకాశం ఉంది.
