చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించాలి..నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీ పేట్ వద్ద రైతుల ఆందోళన

చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించాలి..నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీ పేట్ వద్ద రైతుల ఆందోళన

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేటలో శనివారం సదర్మాట్ ఆనకట్ట కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కడెం మాజీ ఎంపీపీ అమ్మి బాపురావు, రైతులు మాట్లాడుతూ వానాకాలం పంటలకు సరిపడా నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారబందీ పద్ధతిలో అందిస్తున్న నీరు సరిపోవడం లేదని తెలిపారు. అదే సమయంలో మండల కేంద్రానికి వెళ్తున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వాహనాన్ని రైతులు ఆపి తమ సమస్యను వివరించారు. 

స్పందించిన కలెక్టర్ ఇరిగేషన్ ఆఫీసర్లతో మాట్లాడి ఆనకట్టలోని నీటి నిల్వలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం స్వయంగా కడెం మండలంలోని పంట పొలాలను సందర్శించి, పరిస్థితిని పరిశీలిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.