ఆదివాసీల భారీ ర్యాలీ..కుమ్రం భీమ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

ఆదివాసీల భారీ ర్యాలీ..కుమ్రం భీమ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
  • ఆవిష్కరించిన ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • అనంతరం అడవి బిడ్డల భారీ బహిరంగ సభ
  • పోడు భూములు, ఇతర సమస్యలను తీర్చాలని డిమాండ్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కుమ్రం భీమ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు శుక్రవారం అడవిబిడ్డలు కదంతొక్కారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని గొండు గూడాల నుంచి  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  డోలు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో భారీ ర్యాలీ తీశారు.

గుడిహత్నూర్‌‌‌‌(ఇంద్రవెల్లి),వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి అడవిబిడ్డలు భారీగా తరలివచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కుమ్రం భీమ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని గొండు గూడాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం నుంచి విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. డోలు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు తమ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పారు. అనంతరం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మహారాష్ట్రలోని అర్ని ఎమ్మెల్యే తొడసం రాజు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమ్రం భీమ్ మనవడు సోనేరావు తదితరులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో తొమ్మిది తెగల ఆదివాసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. హక్కుల సాధన కోసం పూర్వీకులు చేసిన పోరాటాలను మరువరాదన్నారు. కుమ్రం భీమ్ ఆశయాలను స్మరించుకుంటూ ఆదివాసీ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వాటిని భావితరాలకు అందించాలని సూచించారు. పోడు భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల రాష్ట్ర నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.