- కంప్లయింట్ చేసిన సంధు, వివేక్ జోషి
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) లో అంతర్గత విభేదాలు మరొక్కసారి రచ్చకెక్కాయి. కమిషన్‌లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీశ్ గార్గ్ తీరుపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జులై 29న వారు రాసిన వేర్వేరు లేఖల వివరాలు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా తాజాగా బహిర్గతమయ్యాయి.
ఎన్నికల సంఘం పరిపాలనా విభాగం (అడ్మినిస్ట్రేషన్) ఇన్‌చార్జీగా ఉన్న డిప్యూటీ ఈసీ భాను ప్రకాశ్ సెలవుపై వెళ్లడంతో.. ఆ అదనపు బాధ్యతలను జులై 28న మనీశ్ గార్గ్‌కు తాత్కాలికంగా అప్పగించారు. అయితే, లింక్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే ఆయన సీనియర్ డిప్యూటీ ఈసీలు, డిప్యూటీ ఈసీలు, డైరెక్టర్ జనరల్స్ సహా పలువురు ఉన్నతాధికారుల పని విభజనను సమూలంగా మారుస్తూ సొంతంగా ఉత్తర్వులు జారీ చేశారు.
నిబంధనల ఉల్లంఘనే: ఈసీలు
కమిషన్‌తోగానీ, సంబంధిత ఉన్నతాధికారులతోగానీ ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండా.. సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా గార్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సుఖ్‌బీర్ సింగ్ సంధు తన లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చారని, కమిషన్ అనుమతి లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఈసీల చట్టం-2023లోని సెక్షన్ 18(1), 18(2)ల తీవ్ర ఉల్లంఘన అని ఆయన ఆరోపించారు.
వివేక్ జోషి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ.. సంబంధిత పని కేటాయింపు ఫైలును పరిశీలించేందుకు అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని కోరగా, కనీసం ఆ ఫైలును కూడా తనకు అందించకుండా నిరాకరించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేబినెట్ సెక్రటేరియెట్ స్పందన అంతంతే..
రాజ్యాంగబద్ధ సంస్థ అంతర్గత వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదు కావడంతో కేబినెట్ సెక్రటేరియెట్ ఆచితూచి స్పందించింది. ఇద్దరు కమిషనర్లు వ్యక్తిగత హోదాలోనే లేఖలు రాశారని, దీనిపై నేరుగా జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగ సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లవుతుందని అంతర్గత నోట్‌లో పేర్కొన్నది. అయితే, ఆ లేఖలను నమోదు చేసుకుంటూ.. డీవోపీటీ కార్యదర్శి, ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్, సీఈసీ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీలకు సమాచారం అందించింది.
