కృష్ణకాంత్ పార్క్ లో చెరువు విస్తరణ షురూ..పనులు ప్రారంభించిన హైడ్రా కమిషనర్

కృష్ణకాంత్ పార్క్ లో చెరువు విస్తరణ షురూ..పనులు ప్రారంభించిన హైడ్రా కమిషనర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కృష్ణకాంత్ పార్క్​లోని చెరువు విస్తరణ చేపడుతోంది. సంబంధిత పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును 12 ఎకరాలకు విస్తరించడంతోపాటు లోతు పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. గతంలో 27 ఎకరాల్లో ఉన్న ఈ చెరువుకు జూబ్లీహిల్స్‌‌, వెంకటగిరి, కృష్ణానగర్‌‌, యూసుఫ్‌‌గూడ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరేది. కాలక్రమేణా చెరువు విస్తీర్ణం తగ్గిపోవడంతో కొద్దిపాటి వర్షానికే కృష్ణానగర్‌‌, యూసుఫ్‌‌గూడ, అమీర్‌‌పేట మైత్రీవనం పరిసరాలు నీటమునుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో చెరువు విస్తరణలో భాగంగా అక్కడి చెట్లను శాస్త్రీయ పద్ధతిలో తరలించేందుకు ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అనుమతులు లభించాయి. వాటిని సున్నం చెరువు పరిసరాల్లో తిరిగి నాటనున్నారు. చెరువులోకి వరద నీరు చేరేందుకు ఇన్‌‌లెట్లు, నీరు బయటకు వెళ్లేందుకు ఔట్‌‌లెట్లు నిర్మించనున్నారు. చెరువు చుట్టూ బండ్‌‌, వాకింగ్‌‌ పాత్‌‌వే, ఫెన్సింగ్‌‌, ఓపెన్‌‌ జిమ్‌‌, పిల్లల ఆట స్థలం ఏర్పాటు చేయనున్నారు.