రాష్ట్రానికి రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రాబట్టాలి..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం

రాష్ట్రానికి రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రాబట్టాలి..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
  • ప్రతి శాఖాధిపతి ప్రత్యేక చొరవ చూపాలని సూచన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. శనివారం ఆయన రాష్ట్ర సచివాలయంలో కీలక అంశాలపై శాఖలవారీగా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఖర్చుల వివరాల నమోదును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులకు సూచించారు.

పెండింగ్‌లో ఉన్న సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించి ఎస్ఎన్ఏ(సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాల సర్దుబాటును వేగవంతం చేయాలన్నారు. కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న నిధులను నూరు శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ప్రతి శాఖాధిపతి ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు కేంద్ర నిధుల సాధన ప్రక్రియను అన్ని శాఖల కార్యదర్శులు ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని తేల్చిచెప్పారు.

పథకాల పురోగతిని  సీఎం డ్యాష్‌బోర్డు ద్వారా ఉన్నతస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వేగంగా క్లియర్ చేసుకునేందుకు కేంద్ర అదనపు కార్యదర్శులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తన తరఫున కేంద్రానికి డీవో(డెమి అఫీషియల్ )లేఖలు పంపిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో తాను స్వయంగా మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదలయ్యేలా చూస్తానన్నారు. కేంద్ర నిధులు తోడైతేనే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత వేగవంతం అవుతాయని, ఈ ప్రక్రియలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని సీఎస్ స్పష్టం చేశారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు బీఎండీ ఎక్కా, దానకిషోర్, ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానియా, యోగితారాణా, అహ్మద్ నదీమ్, క్రిస్టినా జొంగ్తు తదితరులు పాల్గొన్నారు.