హైదరాబాద్, వెలుగు: పాలమూరు రైతుల ప్రయోజనాలకు గండికొట్టేలా ఉన్న డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే సీఎం కుర్చీ దక్కిందన్న నిజాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని, జిల్లా ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికీ సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సమీక్షించి, జూరాల నుంచే నీటిని తీసుకునే విధానాన్ని మళ్లీ పరిశీలించాలని డిమాండ్ చేశారు. నల్గొండకు తరలించాలనుకుంటున్న 0.6 టీఎంసీల నీటిని పాలమూరు రైతులకే దక్కేలా చూడాలని కోరారు.
30 ఊళ్లు మునిగిపోతయ్
డిండి లిఫ్ట్ తో 60 కిలోమీటర్ల మేర 30 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన డీకే అరుణ వ్యక్తం చేశారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి పుట్టంగండి లిఫ్ట్ ఉందని, నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్, నక్కలగండి, మల్లన్న సాగర్ ద్వారా నీళ్లిచ్చే ప్రత్యామ్నాయాలున్నాయన్నారు. అలా కాకుండా రెండు జిల్లాల రైతుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టు మొదలై ఏళ్లు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి డిండి వైపు తరలించే ప్రతి నీటి బొట్టునూ పాలమూరు రైతుల కోసమే కేటాయించాలని స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని వెల్లడించారు.
